Women Success Story: కష్టమనుకుంటే ఏదీ చేయలేం... కానీ అదే ఇష్టంగా భావించి కృషి చేస్తే విజయం దానంతట అదే వస్తుందనడానికి నిదర్శనం ఈ నలుగురు నారీమణులు. వరంగల్‌కు చెందిన ఉమాదేవి, రమాదేవి, ఉషారాణి, అర్చనలు...పెళ్లి చేసుకుని వంటింటికే పరిమితం కాకుండా... పాకశాస్త్రాన్నే ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. తెలుగు సంప్రదాయ పిండి వంటకాలు నేటి తరం మరచిపోకూడదనే ఉద్దేశంతో... శ్రీనిధి తెలంగాణ పిండివంటశాలను ఏర్పాటు చేశారు.
నలుగురితో ప్రారంభమై...
2016లో నలుగురుతో ప్రారంభించిన ఈ వంటశాలలో ఇప్పుడు 70 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరు సకినాలు, పల్లిగారెలు, పప్పుగారెలు, పల్లిఉండలు, సర్వపిండి, మడుగులు, అరిసెలు అన్ని రకాల పిండివంటలు తయారుచేస్తూ... విదేశాలతోపాటు వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నారు. నాణ్యత, శుభ్రతకు పెద్దపీట వేయడంతో... ప్రారంభించిన కొద్ది కాలంలోనే మూడు చోట్ల పిండివంటల దుకాణాలను ప్రారంభించారు. నిర్వాహకులు, పనిచేసేవాళ్లూ అంతా మహిళలే కావటంతో ఎలాంటి ఇబ్బందులు ఉండడంలేదు.