ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వరి, మొక్కజొన్న విత్తనాలు క్రయ విక్రయాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు విత్తన డీలర్లను హెచ్చరించారు. వరంగల్ పట్టణ జిల్లా కలెక్టరేట్లో విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంటల నియంత్రణ విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో మెుక్కజొన్న విత్తనాలను విక్రయించడానికి వీలులేదని డీలర్లను కోరారు. వరి పంట వేసేందుకు ప్రభుత్వం పంట రకాలను నిర్ణయిస్తుందని, అప్పటివరకు వరి విత్తనాలు కూడా విక్రయించవద్దని సూచించారు. ఏ రకాలు ఎంత విస్తీర్ణంలో వేయాలని ప్రభుత్వం సూచించిన తర్వాత డీలర్లకు తెలియజేస్తామన్నారు. మొక్కజొన్న వేసిన రైతులకు రైతుబంధు పథకం వర్తింపజేయడం జరగదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. కావున ఏ ఒక్కరైతుకు మెుక్కజొన్న విత్తనాలు అమ్మకూడదని, రైతులకు విషయాన్ని అర్థమయ్యేలా వివరించాలని డీలర్లకు కలెక్టర్ సూచించారు.
మెుక్కజొన్న విత్తనాలు విక్రయించడానికి వీలులేదు: కలెక్టర్ - warangal urban district news
వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వరి, మెుక్కజొన్న విత్తనాలు క్రయ విక్రయాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇప్పటికే మొక్కజొన్న, వరి విత్తనాలను తెచ్చుకొని సిద్దంగా ఉన్న నేపథ్యంలో నష్టం జరిగే అవకాశం ఉందని డీలర్లు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఈ విషయంలో వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా పాలనాధికారిని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ విత్తన డీలర్లకు వివరించారు.రెండు లేదా మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ విషయం లో రైతులు కూడా ఎలాంటి తొందర పడకుండా వరి విత్తనాలు కొనుగోలు చేయవద్దని కోరారు.
ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష