Warangal Traffic problems: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ప్రఖ్యాతిగాంచిన నగరం ఓరుగల్లు. దానితోపాటు హనుమకొండ, కాజీపేట, వరంగల్ పక్కపక్కనే ఉండటంతో ట్రైసిటీస్‌గా సైతం ప్రసిద్ధి. చారిత్రకంగా సైతం ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ నగరం వందలసంఖ్యలో వాహనాలు, వేలసంఖ్యలో ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగా రహదారుల విస్తీర్ణం లేకపోవటం, కూడళ్ల వద్ద పోలీసులు సరైన విధులు నిర్వహించకపోవడంతో ట్రాఫిక్ అస్తవస్త్యంగా మారింది.
దీనికి తోడు వాహనదారులు సైతం ట్రాఫిక్ నియమాలు సరిగ్గా పాటించకపోవడంతో నగరంలో వాహనాల రద్దీ సమస్య తీవ్రరూపం దాలుస్తుంది. వాహనాల రద్దీని క్రమబద్దీకరించాల్సిన ట్రాఫిక్‌సిబ్బంది జరిమానాలే లక్ష్యంగా ఫోటోలు తీస్తుండటంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. రద్దీ ప్రాంతాలలో సైతం పోలీసులు జరిమానాలపైనే దృష్టి కేంద్రికరిస్తుండటంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.