Warangal Thefts 2023 : గ్రేటర్ వరంగల్ పరిధిలో రోజురోజుకూ నేరాల సంఖ్య పెరుగుతుంది. నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు.. అందినకాడికి దోచుకుంటున్నారు. నగరంలో నిన్న ఒక్కరోజే వేర్వేరు కాలనీల్లోని 5 ఫ్లాట్లలో చోరీలకు తెగబడ్డ దొంగలు.. మొత్తం 105 తులాలకు పైగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మట్టెవాడ పరిధిలోని గాయత్రి అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ తాళం పగులగొట్టి 30 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. హనుమకొండ పరిధిలోని నయీంనగర్, కిషన్‌పుర ప్రాంతాల్లో మూడు ఫ్లాట్స్‌లలో చొరబడి 60 తులాల ఆభరణాలను చోరీ చేశారు. సుబేదారి పరిధిలో మారుతి అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో దాదాపు 15 తులాల బంగారు ఆభరణాలు అపహరించిన దొంగలు.. మరో ఇంట్లో చోరీకి యత్నించారు.
Chain Snatching in Bodhan : అలా వచ్చి.. ఇలా దోచుకున్నారు.. తేరుకునేలోపే పరారయ్యారు
A Series of Thefts in Warangal..: వరంగల్‌లోని గాయత్రి అపార్ట్‌మెంట్‌లోచొరబడిన దొంగలు ఇరవై తులాల బంగారాన్ని దోచుకున్నారు. ఎమ్జీఎమ్ ఆసుపత్రి సమీపంలోని వద్దిరాజు రెసిడెన్సీలో మరో 30 తులాల బంగారం, రూ.20 వేల నగదు అపహరణకు గురైందని.. యజమాని రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీలకు సంబంధించి.. ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టిన దొంగలు.. ప్రత్యేక ఆయుధాలను ఉపయోగించి బీరువా తెరిచారని వరంగల్ ఏసీపీ కిషన్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీంతో ఆధారాల సేకరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఏసీపీ కిషన్ తెలిపారు.
'వరంగల్ వద్దిరాజు, గాయత్రి అపార్ట్‌మెంట్‌లలో దొంగతనాలు జరిగాయి. ఇద్దరు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. తలుపులు పగులకొట్టి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.' - బోనాల కిషన్, వరంగల్ ఏసీపీ
మరోవైపు హనుమకొండ నయీంనగర్‌లోని మారుతి అపార్ట్‌మెంట్‌లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. మైలారంలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న కాసం నిఖిల్ ఇంటి తాళాన్ని పగులగొట్టి సుమారు రూ.లక్ష నగదుతో పాటు 50 తులాల బంగారాన్ని అపహరించారు. లహరి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దుండగులు.. రమేశ్, శ్రీదేవి దంపతులకు చెందిన 15 తులాల బంగారాన్ని దోచుకున్నారు. వరుస చోరీలతో అప్రమత్తమైన నగర పోలీసులు దొంగల కోసం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిందితుల కోసం సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద వాహన తనిఖీలను నిర్వహించడంలో నిమగ్నమయ్యారు.