తెలంగాణ

telangana

ETV Bharat / state

యూఎన్‌డీపీలో వరంగల్ ఎంపిక.. వ్యర్థాల శుద్ధీకరణకు మొగ్గు - warangal steps forward for decomposing all the waste

సాంకేతిక పద్ధతుల ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యునైటెడ్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం(యూఎన్‌డీపీ) లక్ష్యం. ఈ పథకంతో ఇప్పటికే దేశంలో 60 నగరాలకుగాను 40 స్వచ్ఛ దిశగా అడుగులేస్తున్నాయి. వరంగల్‌ స్వచ్ఛతలో పూర్తిగా వెనుకబడిపోయింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులో అడుగున ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండో అతి పెద్దదైన మన నగరాన్ని ఎంపిక చేశారు. ఇక వ్యర్థాల శుద్ధీకరణ, పునర్వినియోగం దిశగా అడుగులేయనుంది. పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్త తొలగి పరిశుభ్ర నగరంగా మారనుంది.

warangal city selected for development under undp
యూఎన్‌డీపీలో వరంగల్ ఎంపిక.. వ్యర్థాల శుద్ధీకరణకు మొగ్గు

By

Published : Aug 8, 2020, 2:57 PM IST

వరంగల్‌ మహా నగరంలో రోజూ 250-260 టన్నుల తడి, పొడి చెత్త పోగవుతుంటుంది. ఇందులో 15-20 శాతం వ్యర్థాలను శుద్ధి చేయడం లేదు. వ్యర్థాల శుద్ధీకరణలో గ్రేటర్‌ వరంగల్‌ వెనుకంజలో ఉంది. రాంపూర్‌ డంపింగ్‌ యార్డులో సుమారు ఐదు లక్షల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. గ్రేటర్‌ వరంగల్‌ స్మార్ట్‌ సిటీ పథకం కింద ఎంపికై నాలుగేళ్లవుతున్నా ఘనవ్యర్థాల నిర్వహణ(సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌)- 2016 నిబంధన అమలుపై దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. వ్యర్థాల శుద్ధీకరణలో ఆధునిక, సాంకేతిక విధానాలు అమలుకు శ్రీకారం చుట్టడం లేదు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు డీపీఆర్‌లకే పరిమితమైంది. తడి, పొడి చెత్త శుద్ధీకరణలో శాస్త్రీయ విధానాలు పాటించకపోవడంలో రెండు, మూడేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో నగరపాలక సంస్థ మెరుగైన ర్యాంకు సాధించడం లేదు. రాంపూర్‌ డంపింగ్‌ యార్డులో లక్షల టన్నుల వ్యర్థాలు కుళ్లిపోతున్నాయి. రీ క్యాపీంగ్‌ సిస్టమ్‌, రెమిడెక్స్‌ ప్రాజెక్టు ఏదీ అమలు చేయడం లేదు. వ్యర్థాల శుద్ధీకరణలో వెనుకంజలో ఉన్న నగరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గుర్తించింది. యూఎన్‌డీసీ ప్రాజెక్టులో గ్రేటర్‌ వరంగల్‌కు అవకాశం దక్కింది. దీన్ని చక్కగా ఉపయోగించుకుంటే పొడి చెత్త పునర్వినియోగానికి(రీ స్లైకింగ్‌) దారులు పడినట్లే. కమిషనర్‌ పమేలా సత్పతి కొత్త ప్రాజెక్టు అమలుపై దృష్టి సారించారు.

వరంగల్‌లో ఇలా ఉంది

  • యూఎన్‌డీపీ ప్రాజెక్టులో వరంగల్‌కు అవకాశం దక్కింది. పొడి చెత్తను పునర్వినియోగపర్చే వీలుంటుంది. స్క్రాప్‌ వెండర్లు(పాత ఇనుప సామాన్ల వర్తకులు), ర్యాక్‌ పిక్కర్సు(చెత్త ఏరుకునే కార్మికులు), బల్దియా డీఆర్సీ సెంటర్లకు వచ్చే పొడి చెత్తను ఒకే దగ్గరికి చేరుస్త్తారు. డ్రై వేస్టేజీ, ఈ-వేస్టేజీగా వేరు చేస్తారు. పునర్వినియోగానికి ఉపయోగపడే వాటిని వేరు చేస్తారు. డ్రై వేస్టేజీలో ప్లాస్టిక్‌ కవర్లు, పేపరు, గాజు సీసాలు, ఇనుము, ప్లాస్టిక్‌ బాటిళ్లు తదితరాలు ఒక దగ్గర పోగు చేసి ఆధునిక, సాంకేతిక పద్ధతుల ద్వారా రీ సైక్లింగ్‌ చేస్తారు. ఈ- వేస్టేజీలో కంప్యూటర్‌ వస్తువులు, సీడీలు, డీవీడీలు, పాడైన ఫ్రిజ్‌లు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులు సేకరిస్తారు. వీటిని రీ సైక్లింగ్‌ చేస్తారు.
  • నగరంలో రోజూ 250-260 టన్నుల చెత్త వస్తుంది. ఇందులో పొడి చెత్త 50-60 టన్నులు ఉంటుంది. 35 డ్రై రిసోర్స్‌ సెంటర్ల ద్వారా రోజూ 15-20 టన్నుల పొడి చెత్తను సేకరిస్తున్నారు. వావ్‌, ఐటీసీ కంపెనీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. యూఎన్‌డీపీ ప్రాజెక్టు అమల్లోకి వస్తే స్వచ్ఛ కేంద్రాలు ఏర్పాటు చేసి వరంగల్‌ నగరంలోనే డ్రై, ఈ- వేస్టేజీలను రీ సైక్లింగ్‌ చేస్తారు.

ఇతర నగరాల్లో ఇలా

యూఎన్‌డీపీ ప్రాజెక్టు ఇప్పటికే దేశంలోని 40 నగరాల్లో అమలవుతోంది. స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతుల కోసం 22 మెటీరియల్‌ రికవరీ సెంటర్లు(స్వచ్ఛ కేంద్రాలు) స్థాపించారు. 17వేల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ను పునిర్వినియోగపరిచారు. స్వచ్ఛ కేంద్రాల ద్వారా అనధికారిక రంగానికి చెందిన కార్మికులను సంస్థాగతీకరించే ప్రయత్నంలో ఈ ప్రాజెక్టు ద్వారా 1756 మంది సఫాయి కుటుంబాలకు ఆర్థిక పరిపుష్ఠి లభించింది. వారు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసుకునే వీలు కలిగింది. స్వచ్ఛ కేంద్రాల్లో పనిచేసే వారికి నిరంతరం శిక్షణ ఇస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details