Warangal Accident News :వర్ధన్నపేటలో ఆర్టీసీ బస్సును, ఓ డీసీఎం వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలోఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పత్తిలోడుతో తొర్రూర్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం.. ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం నడుపుతున్న డ్రైవర్ రాజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదే వాహనంలో ఉన్న నలుగురు మహిళలు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరంతా క్యాబిన్‌లో ఇరుక్కుపోయి.. గంట పాటు నరకయాతన అనుభవించారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. అతికష్టం మీద మహిళలను బయటికి తీసి చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. వారంతా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
డీసీఎం అతివేగంతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు బస్సు కండక్టర్ తెలిపారు. రెండు భారీ వాహనాలు ఢీకొనడంతో వాహనదారులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. గాయపడ్డ వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న వర్ధన్నపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.