వరంగల్ అర్బన్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. రాత్రి సమయాల్లో ఇంటి కిటికీ ఊచలు తొలగించి చోరీలకు పాల్పడుతున్నాడు హన్మకొండకు చెందిన సయ్యద్ కైసర్. నిందితుడిని వరంగల్ సీసీఎస్, సుబేదారి పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో నిందితుడి కదలికలు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.34 లక్షలు విలువ చేసే 637 గ్రాముల బంగారం, 1కిలో 180 గ్రాముల వెండి, 2 కెమెరాలు, 6 సెల్ఫోన్లు, పాస్పోర్ట్, 1ట్యాబ్, 7 చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు సయ్యద్ కైసర్ 2012లో ఉద్యోగ నిమిత్తం సౌదీ అరేబియాకి వెళ్ళాడు. అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల సంస్థ అతడిని ఉద్యోగం నుంచి తీసేసింది. తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఉపాధి కోసం ఆటో నడిపినప్పటికీ ఆదాయం సరిపోక.. హన్మకొండకు చేరుకున్నాడు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో 2017 నుండి చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. కమీషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 14 చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు.