రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్ స్పెక్టర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో సీపీ పలు ముఖ్య సూచనలు చేశారు. పనుల్లో మరింత రాణించేందుకు రూపొందించిన 17 వర్టికల్స్ అమలు తీరుపై ఆరా తీశారు.
పోలీస్ అధికారులు స్టేషన్ పరిధిలో కేసుల నమోదు చేయటంతో పాటు.. త్వరితగతిన ఛార్జీషీట్ను కోర్టుకు అందజేయాలని తెలిపారు. ప్రజలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. పెట్రోలింగ్ విధిగా చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి..
రోడ్డు ప్రమాదాలపై పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రమాదాల నివారణ ప్రతి అధికారి తమ వ్యక్తిగత బాధ్యతగా గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు అన్ని మార్గాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని తెలిపారు.
పోలీసు అధికారి హెల్మెట్ ధరించాలి..
ప్రతి పోలీస్ అధికారి హెల్మెట్ ధరించి వాహనం నడిపే విధంగా తగు చర్యలు తీసుకోవడంతో పాటు, నియమాలను అతిక్రమించిన పోలీసులపై జరిమానా విధించాల్సిందిగా సీపీ అదేశించారు. నేరాల నియంత్రణకు విజుబుల్ పోలీస్ పెంచాలన్నారు. కీలక సమయాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్లపై విధులు నిర్వహించడం ద్వారా ప్రజల్లో శాంతి భద్రతలపై నమ్మకం, ధైర్యాన్ని తీసురాగలమని కమిషనర్ అధికారులకు తెలిపారు.
ఇదీ చూడండి:జడ్పీలో పెట్రోల్ బాటిల్తో దంపతులు..