తెలంగాణ

telangana

By

Published : Sep 25, 2020, 10:17 PM IST

ETV Bharat / state

బాలును స్మరించుకుంటున్న వరంగల్​.. ప్రముఖుల నివాళి

పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వరంగల్లుకు వచ్చిన ఎస్పీ బాలసుబ్రమణ్యంతో గల అనుభూతులను, జ్ఞాపకాలను వరంగల్​ వాసులు గుర్తు చేసుకుంటున్నారు. పాడుతా తీయగా, స్వరాభిషేకం, మేడారం జాతరవంటి పలు సందర్భాల్లో వరంగల్​ వాసులను తన పాటలతో అలరించారు.

Warangal Ministers Peoples Condolance to SP Balu
బాలును స్మరించుకుంటున్న వరంగల్​.. ప్రముఖుల నివాళి

చారిత్రక నగరం ఓరుగల్లుకు ఎస్పీ బాలసుబ్రమణ్యం పలుసార్లు విచ్చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని.. వరంగల్​ వాసులను తన గానమాధుర్యంతో అలరించారు. 1995లో ఆర్‌ఈసీలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికి బాలు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 2013 మార్చిలో పాడుతా తీయగా కార్యక్రమం కోసం హన్మకొండకు వచ్చి నాలుగు రోజుల పాటు బస చేశారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌ బాలుకు ఓరుగల్లు చరిత్రను క్లుప్తంగా రాసిచ్చారు.

2014 ఫిబ్రవరిలో మేడారం జాతర జరుగుతున్న సమయంలో పాడుతా తీయగా కార్యక్రమం కోసం ఆయన వరంగల్‌కు మరోసారి వచ్చారు. 2015లో స్వరాభిషేకం కార్యక్రమాన్ని బాలు ఇక్కడే నిర్వహించారు. వరంగల్‌ కేఎంసీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలు సోదరి శైలజ కూడా పాల్గొని వారి గానమాధుర్యంతో వరంగల్​ వాసులను సంగీత ప్రపంచంలో తేలియాడేలా అలరించారు.

వరుసగా మూడేళ్లు ఎస్పీ బాలు సాంస్కృతిక రాజధాని ఓరుగల్లుకు వచ్చి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పాటలు పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. ఆయన మృతి పట్ల వరంగల్​ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. బాలు మరణం అత్యంత బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. అనేక భారతీయ భాషల్లో పాడిన అద్భుత గాయకుడు బాలు అని కీర్తించారు. అయన మరణం యావత్ దేశానికి పాటల ప్రియులకు... తీరని లోటని అన్నారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు ఎర్రబెల్లి సంతాపం తెలిపారు.

పాటకు పట్టం కట్టి... తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్ధాయికి తీసుకెళ్లారని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన పాట మన మధ్యే ఉంటుందన్నారు. సమ్మోహన గాయకుడి.. మరణ వార్త పాటల ప్రియులను విషాదంలోకి నెట్టిందని.. మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పలు కార్యక్రమాలు వరంగల్​ జిల్లాలో నిర్వహించి.. ఇక్కడి ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్న బాల సుబ్రమణ్యానికి వరంగల్​ ప్రముఖులు, జిల్లా ప్రజలు కన్నీటితో నివాళులర్పించారు.

ఇదీ చదవండిఃగగనానికేగిన గానగంధర్వునికి రాష్ట్ర మంత్రుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details