Special Clinic for Transgenders in MGM Hospital: ట్రాన్స్‌జెండర్లు అనారోగ్యం వస్తే చూపించుకోవడానికి ఆసుపత్రులకు వెళ్లలేరు. ఎక్కడికి వెళ్లినా చుట్టూ ఉన్న పదిమంది చూపు వీరిపైనే. పైగా హిజ్రాలకు ఎన్నో శారీరక, మానసిక సమస్యలూ ఉంటాయి. అనారోగ్యం పాలైనప్పుడు.. అనుభవంలేని వైద్యుల దగ్గరకెళ్లి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వేలల్లో సొమ్ము వృథా చేసుకుంటున్నారు. ట్రాన్స్‌జెండర్ల అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం.. వరంగల్ ఎంజీఎంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఓ ప్రత్యేక క్లినిక్ ఆగస్టు 2న ప్రారంభమైంది.
ప్రత్యేక గదులు ఏర్పాటు: ఇతరులతో కలిసి గంటల సేపు నిల్చునే అవసరం లేకుండా మూడో వర్గం వారి కోసం ఇక్కడ ప్రత్యేక ఓపీ ఉంటుంది. చర్మవ్యాధులు, యూరాలజీ, ఇతరత్రా అనారోగ్య సమస్యలూ, మానసిక సంబంధమైన సమస్యలకూ ఈ క్లినిక్‌లో వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారు. 133, 134 గదులు వీరికి కేటాయించారు. బాధితుల కోసం కావాల్సినంత సమయాన్ని వైద్యులు వెచ్చించడమూ ఊరట నిస్తోంది. దీంతో ఇక్కడకొచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.