చారిత్రక నగరమైన ఓరుగల్లుకు కొత్త మేయర్ ఎవరన్న ఉత్కంఠకు తెరదించుతూ... తెరాస అధినాయకత్వం 26వ డివిజన్ కార్పొరేటర్ గుండా ప్రకాష్ రావును ఎంపిక చేసింది. ఈసారి మేయర్ స్థానానికి గట్టి పోటీ ఉండడంతో... తెరాస ప్రధాన కార్యదర్శి బాలమల్లును వరంగల్‌కు పంపించారు. రెండు రోజుల పాటు కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయాలను బాలమల్లు తెలుసుకుని అధిష్ఠానానికి నివేదించారు. సమర్ధత, అనుభవం, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మద్దతు మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం... పార్టీ సీనియర్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త గుండా ప్రకాష్ రావును మేయర్ పదవికి ఎంపిక చేశారు.
మేయర్ ఎన్నికపై నగర పాలక సంస్ధ కౌన్సిల్ హాల్లో ఈ రోజు ఉదయం కార్పొరేటర్లంతా సమావేశమై గుండా ప్రకాష్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వ్యవహరించారు. కార్పొరేటర్ వద్దిరాజు గణేశ్ ప్రకాశ్‌రావు పేరును ప్రతిపాదించగా... మిలిగిన వారంతా బలపరిచారు. కార్పొరేటర్లు ఎవరూ పోటీకి రానందున... ప్రకాశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేయించారు.