తెలంగాణ

telangana

ETV Bharat / state

Warangal KMC: 'ర్యాగింగ్​పై ఎలాంటి ఫిర్యాదు అందలేదు.. ఆ ట్వీట్​లో నిజం లేదు'

వరంగల్​ కేఎమ్​సీ(Warangal KMC)లో జూనియర్లపై ఎలాంటి ర్యాగింగ్(Ragging)​ జరగలేదని ఆ కళాశాల ప్రిన్సిపల్​ మోహన్​దాస్​ స్పష్టం చేశారు. ర్యాగింగ్​పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏసీపీ పేర్కొన్నారు. ఎవరో కావాలనే సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ప్రిన్సిపల్​ ఆరోపించారు.

warangal kakatiya medical college
వరంగల్​ కాకతీయ వైద్య కళాశాల

By

Published : Nov 15, 2021, 5:27 PM IST

వరంగల్​ కాకతీయ వైద్య కళాశాల(Warangal KMC)లో ర్యాగింగ్ జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై కళాశాల యాజమాన్యం స్పందించింది. కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్(Ragging) జరగలేదని కేఎమ్​సీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ స్పష్టం చేశారు. ఫ్రెషర్స్ డే ను వాయిదా వేసేందుకు ఎవరో కావాలనే ఇలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసినట్లు ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు కళాశాల(Warangal KMC)లో విచారణ చేసినట్లు వరంగల్ ఏసీపీ గిరి కుమార్ వివరించారు. కళాశాల ఆవరణలో వసతి గృహాలు వేర్వేరుగా ఉన్నాయని.. జూనియర్ వసతి గృహానికి, సీనియర్ల వసతి గృహానికి చాలా దూరం ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ర్యాగింగ్ జరిగిందంటూ ఏ ఒక్కరూ తమకు ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే విచారణ చేశామని చెప్పారు. ట్విట్టర్ ఖాతాలో ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు.

కళాశాల ఆవరణలో సీనియర్లకు, జూనియర్లకు వసతి గృహాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇటీవల సీనియర్లు కొందరు జన్మదిన వేడుకలు చేసుకున్నారు. ఆ వేడుకల్లో ఏదో అలజడి జరిగిందని సెక్యూరిటీ గార్డు.. ఇన్​ఛార్జికి ఫిర్యాదు చేశారు. ఆయన వచ్చి పరిశీలించి.. అక్కడ అంతా సవ్యంగా ఉందని గుర్తించారు. ర్యాగింగ్​పై మాకు ఇంతవరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం మేరకే మేము విచారణ చేశాం. ట్విట్టర్​ ఖాతాలో ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నాం. -గిరి కుమార్​, వరంగల్​ ఏసీపీ

ఏం జరిగిందంటే..

సీనియర్‌ విద్యార్థులు మద్యం మత్తులో ఫ్రెషర్స్‌ డే పేరుతో జూనియర్లను ర్యాగింగ్‌(Ragging) చేస్తున్నారంటూ ఓ విద్యార్థి(Warangal KMC).. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, డీజీపీ, రాష్ట్ర వైద్యసంచాలకులను ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. 2017 బ్యాచ్‌కు చెందిన సుమారు 50 మంది సీనియర్లు మద్యం తాగి తమను వేధిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎవరూ ఫిర్యాదు చేయలేదు

ఈ విషయంపై కళాశాల(Warangal KMC) ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మోహన్‌దాసును వివరణ కోరగా అలాంటిదేమీ లేదని వెల్లడించారు. సీనియర్లు కొందరు జన్మదిన వేడుకలు చేసుకున్నారని.. ఆ సందర్భాన్ని గిట్టనివారు ఇలా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. ఘటనపై డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి సైతం ఆరా తీశారు. సోమవారం కేఎంసీలో జరగాల్సిన ఫ్రెషర్స్‌డేకు అనుమతి ఇవ్వొద్దని ఆయన సూచించినట్లు సమాచారం. ట్విట్టర్‌లో వచ్చిన ఫిర్యాదుపై వరంగల్​ సీపీ ఆదేశాలతో మట్టెవాడ స్టేషన్‌ పోలీసులు ఆదివారం కేఎంసీలో విచారణ జరిపారు. ర్యాగింగ్‌పై తమకు విద్యార్థులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని సీఐ గణేశ్‌ తెలిపారు. రెండు నెలల క్రితం ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను కళాశాలలో ర్యాగింగ్‌ చేయడం అప్పట్లో కలకలం రేపిన విషయం విదితమే.

ఇదీ చదవండి:Bandi Sanjay tour: బండి పర్యటనలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న తెరాస, భాజపా కార్యకర్తలు

Siddipet collector resigns: ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. త్వరలో తెరాసలోకి!

ABOUT THE AUTHOR

...view details