తెలంగాణ

telangana

ETV Bharat / state

సైకిల్ ఫర్ ఛేంజ్ ఛాలెంజ్ పోటీలో ఓరుగల్లు సత్తా - Cycle for Change Challenge

వరంగల్‌లో సైకిల్ ట్రాక్ అందంగా ముస్తాబవుతోంది. సైకిల్ ఫర్ ఛేంజ్ ఛాలెంజ్ పోటీలో మొదటి దశలో ముందువరుసలో నిలిచిన ఓరుగల్లు నగరం.. రెండో దశలోనూ ప్రథమ శ్రేణిలో సత్తాచాటాలని భావిస్తోంది. కోటి రూపాయల నగదు బహుమతి దక్కించుకునేందుకు సన్నద్ధమవుతోంది.

Cycle for change
సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ పోటీలో ఓరుగల్లు సత్తా

By

Published : Feb 20, 2021, 1:19 PM IST

సైకిల్ ఫర్ ఛేంజ్ ఛాలెంజ్ పోటీలో ఓరుగల్లు సత్తా

చారిత్రక ఓరుగల్లు నగరం రోజురోజుకూ కొత్త అందాలు సంతరించుకుంటోంది. నగరవాసులకు ఆహ్లాదం పంచేలా సైకిల్ ట్రాక్ అందంగా ముస్తాబవుతోంది. రహదారిపై ఎర్రతివాచీ పరిచినట్లుగా అందరినీ ఆకట్టుకుంటోంది. స్మార్ట్ సిటీలో భాగంగా సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ కోసం కాజీపేట నుంచి హన్మకొండ వరకు నాలుగు కిలోమీటర్ల మేర.. ప్రధాన రహదారికి ఇరువైపులా సైకిల్‌ ట్రాక్‌ రూపుదిద్దుకుంటోంది. సైక్లింగ్ ట్రాక్‌ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ ఇటీవల కార్పొరేషన్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం తగ్గించేందుకు ట్రాక్‌లు దోహదం చేస్తాయని మంత్రి ప్రశంశలు కురిపించారు.

ముందువరుసలో వరంగల్‌

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్‌ పోటీ స్టేజ్-1లో వరంగల్ నగరం ఇప్పటికే ముందు నిలిచింది. దేశంలో 25 నగరాలు స్టేజ్-2 కు అర్హత సాధించగా.. హైదరాబాద్‌, వరంగల్ చోటు దక్కించుకున్నాయి. సుందరమైన ట్రాక్ నిర్మాణంతోపాటు నగరవాసులకు సైకిల్ సవారీపై ఆసక్తి కలిగించేందుకు కార్పొరేషన్ అధికారులు పలుమార్లు... సైకిల్ రేస్‌లు నిర్వహించారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆనందం, ఆహ్లాదం,..ఆరోగ్యానికి దోహదం చేస్తాయని అవగాహన కలిగించారు. పెద్ద సంఖ్యలో యువత.. ఉత్సాహంగా సైకిల్ సవారికి మక్కువ చూపుతున్నారు.

కోటి నగదు బహుమతి

సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ పోటీ రెండో దశ వచ్చే నెలలో దిల్లీలో జరగనుంది. నగరంలో సైకిల్ సవారీకి.. ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు.. ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉంది, ట్రాక్‌ల సౌకర్యాలపై దృశ్యరూపకం ద్వారా నగర పాలక సంస్థ కమిషనర్ వివరిస్తారు. పది నగరాలను ఎంపిక చేసి అర్హత సాధించిన నగరానికి కోటి రూపాయల బహుమతిని అందచేస్తారు. ఈ ప్రోత్సాహకాన్ని దక్కించుకునేందుకు ఓరుగల్లు ఉవ్విల్లూరుతోంది.

ABOUT THE AUTHOR

...view details