తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​కు మరో జాతీయస్థాయి ఘనత.. గ్లోబల్​ నెట్​వర్క్​ ఆఫ్ లెర్నింగ్​ సిటీస్​లో స్థానం

Global Network of Learning Cities : కాకతీయుల పూర్వపు రాజధాని వరంగల్ మరో ఘనత సాదించింది. ఇప్పటికే పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతున్నఈ పట్టణం యునెస్కో ‘గ్లోబల్‌ నెట్వర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీస్‌ (జీఎన్‌ఎల్‌సీ)’కు ఎంపికైంది. 44 దేశాల నుంచి 77 నగరాలకు ఈ గుర్తింపునివ్వగా ఇందులో మన దేశం నుంచి 3 మాత్రమే ఉన్నాయి. వరంగల్‌తో పాటు కేరళలోని త్రిశూర్‌, నీలాంబుర్‌ నగరాలు ఈ ఘనత సాధించాయి.

Global Network of Learning Cities
Warangal

By

Published : Sep 7, 2022, 7:56 AM IST

Global Network of Learning Cities : అంతర్జాతీయ వేదికపై ఖ్యాతిని సంపాదిస్తూ వరంగల్‌ నగరం మెరిసింది. ఈమేరకు యునెస్కో ‘గ్లోబల్‌ నెట్వర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీస్‌ (జీఎన్‌ఎల్‌సీ)’కు ఎంపికైంది. తాజాగా 44 దేశాల నుంచి 77 నగరాలకు ఈ గుర్తింపునివ్వగా ఇందులో మన దేశం నుంచి 3 మాత్రమే ఉన్నాయి. వరంగల్‌తో పాటు కేరళలోని త్రిశూర్‌, నీలాంబుర్‌ నగరాలు ఈ ఘనత సాధించాయి. యునెస్కో అనుబంధ సంస్థల్లో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌’ ఒకటి. ఈ సంస్థ ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా 294 నగరాలను ‘జీఎన్‌ఎల్‌సీ’లోకి గుర్తించి అక్కడ విద్యాభివృద్ధికి చేయూతనిస్తోంది.

జీఎన్‌ఎల్‌సీ కార్యక్రమాలు: ఇలా గుర్తింపునిచ్చిన నగరాల్లో ఆన్‌లైన్‌ శిక్షణ, కార్యశాలలు, వయోజన విద్యాకార్యక్రమాలు, వెబినార్లను నిర్వహిస్తోంది. అక్షరాస్యత, విద్య నిరంతర అధ్యయనానికీ కృషి చేస్తోంది. యునెస్కో జీఎన్‌ఎల్‌సీకి 2021 ఆగస్టులో దరఖాస్తులను ఆహ్వానించగా వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ఈ పోటీలో నిలిచింది. ఈమేరకు దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేయగా.. కేంద్రం యునెస్కో పోటీకి పంపింది. జీఎన్‌ఎల్‌సీకి ఎంపిక కావడానికి అనేక అంశాలను పరిశీలిస్తారు. వారసత్వ నగరమైన వరంగల్‌కు ఏటా 30 లక్షల మంది వరకు పర్యాటకులు వస్తున్నారు. దేశంలోనే గొప్ప సందర్శనీయ స్థలాల్లో ఒకటిగా నిలుస్తోంది.

గుర్తింపు పొందడానికి కారణాలు: పచ్చని వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు ఓపెన్‌ జిమ్‌ల వంటివి ఏర్పాటు చేయడంతోపాటు అన్నిరకాల సౌకర్యాలు ఉన్నాయి. మహా నగరపాలక సంస్థ.. పిల్లలు, మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ట్రాన్స్‌జెండర్లకూ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారు గౌరవప్రదంగా జీవనం సాగించేందుకు సౌకర్యాలను కల్పిస్తోంది. ఆకర్షణీయ నగరం పథకంలో భాగంగా అద్భుతమైన గ్రంథాలయాలు నిర్మించి ఇక్కడి విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ వరంగల్‌ నగరాన్ని జీఎన్‌ఎల్‌సీకి ఎంపిక చేశారు.

ABOUT THE AUTHOR

...view details