Flood Flow Stuck In Warangal District : వరుణుడు శాంతించడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వరదలో కొట్టుకుపోయి పంట పొలాల్లో విగతజీవుల్లాగా కొందరు పడిపోగా.. కరెంటు తీగలకు వేలాడుతూ ఒకరు.. మురికి కాల్వలో పడిపోయి ఇంకొకరు కనిపించిన దృశ్యాలు కన్నీరు పెట్టించాయి. ప్రవాహానికి గల్లంతై రెండ్రోజులవుతున్నా.. ఆచూకీ దొరకని వారు ఇప్పటికీ దొరక్కపోవటం ప్రకృతి తాండవానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
వరుణుడి విలయానికి ఉమ్మడి వరంగల్ జిల్లా భారీగా నష్టపోగా.. అందులోనూ ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో మాత్రం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం తగ్గిపోయినా.. ముంచెత్తిన ప్రవాహం తగ్గకపోవటంతో అనేక గ్రామాలు వరద గుప్పిట్లోనే విలవిల్లాడుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో నెలకొన్న దయనీయ పరిస్థితులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం రాత్రి నుంచి జంపన్న వాగు ఉద్ధృతికి కొండాయి, దొడ్ల, మల్యాల గ్రామాలు జలదిగ్బంధం కాగా.. దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. పొంగుతున్న వాగుల మధ్య, అంధకారంలో చిక్కుకుని బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవటంతో అక్కడి ప్రజల పరిస్థితి అరణ్య రోదనైంది. ఈ తరుణంలోనే వాగు దాటుతుండగా 8 మంది గ్రామస్థులు వరదల్లో కొట్టుకుపోయారు. క్లిష్ట పరిస్థితుల్లో గాలించగా.. ఉదయం ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మిగిలిన ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.
NDRP Forces Rescue Operation : మూడు గ్రామాలకు విద్యుత్, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కొండాయితో పాటు దొడ్ల, మల్యాల గ్రామాల ప్రజలను పునరావాసానికి తరలించేందుకు చర్యలు చేపట్టినా.. జంపన్నవాగు ఉద్ధృతికి సహాయక చర్యలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. చుట్టూ వరద నీటి వల్ల పునరావాస కేంద్రానికి తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు బోట్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నారు. ఏటూరు నాగారం మండలం చినబోయినపల్లి వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటుచేసి, జంపన్న వాగు అవతల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వరద పరిస్థితులను డ్రోన్ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాలకు వెళ్లే మార్గం లేక ములుగు నుంచే మంత్రి సత్యవతి రాథోడ్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.