Heavy Rains in Warangal 2023 : ఈ నెల 26 బుధవారం సాయంత్రం.. వర్షాలతో వాగులు, వంకలు నిండుకుండలా మారుతున్నాయి. ఎప్పటిలానే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినా.. ఆ తర్వాత అంతా సర్ధుకుంటుందని భావించారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లక్నవరం సరస్సు, గుండ్లవాగు ప్రాజెక్టు, కాల్వపల్లి సమీపంలో ఉన్న వాగు, అడవుల్లో ఉన్న వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించి.. జంపన్నవాగులోకి వరద పోటెత్తింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ పరుగులు తీశారు.
Warangal Peoples Problems Effected Heavy Rain: వరద ఊరిని ముంచుతుందన్న భయంతో 60 మంది గ్రామపంచాయతీ భవనాలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. మరి కొంతమంది వరదలో ఉన్న చెట్లని ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ క్రమంలోనే 13మంది.. కొండాయి నుంచి మల్యాల వెళ్తుండగా మార్గం మధ్యలో దాటుతుండగా నీటిలో మునిగిపోయారు. ఇందులో ఐదుగురు విద్యుత్ తీగలను పట్టుకొని ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలిన 8మంది మృతి చెందారు. సాధారణ సమయంలో ఏమాత్రం నీరులేని చిన్నపాటి కాల్వ ప్రాణాలు తీయడం గ్రామవాసుల్ని తీరని విషాదంలో నింపింది. తెల్లవారి లేచింది కళ్లముదు తిరిగే వారు ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
తాగేందుకు నీరు కూడా దొరకలేదు : నాలుగు రోజులుగా వరదల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన వారికి తాగేందుకు నీరు, తినేందుకు తిండి దొరకక కష్టమైందని బాధితులు తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సాయం అందే వరకు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపామని గుర్తుచేసుకుంటున్నారు. ముంచెత్తిన వరద నుంచి దొరికిన చోటల్లా తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నామని తెలిపారు. ఆనాటి విపత్తు కళ్లలో మెదులుతుండగానే కొండాయి, దొడ్ల, మాల్యాల గ్రామాల ప్రజలు ఊళ్లకు చేరుకుంటున్నారు. దొడ్ల, మల్యాల గ్రామాల మధ్య ఉన్న వాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. గతేడాది వర్షాలకే ఈ వంతెన కుంగిపోయి ప్రమాదం పొంచి ఉండగా.. ఈసారి పూర్తిగా కొట్టుకుపోయింది.