తన కుటుంబానికి ఏదైనా ఆపద వస్తే కొండంత అండగా నిలిచే స్త్రీ.. ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న కరోనాపై పోరుకు సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నతస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అతివలంతా ఒక్కటై మహమ్మారిపై దండయాత్ర మొదలుపెట్టారు. కొందరు మహిళా మణులు ఊరూరా తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తుంటే... మరికొందరు వైరస్ కట్టడికి కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇంకొందరు ఎండను లెక్కచేయక విధులు నిర్వర్తిస్తున్నారు. కనిపించని శత్రువును మట్టుబెట్టేందుకు రాణీ రుద్రమ స్ఫూర్తితో పెద్ద పోరాటమే సాగిస్తున్నారు.●
- జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్ నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వలస కార్మికులకు సామగ్రి పంపిణీ నుంచి మొదలుకొని అధికారులతో సమీక్షల వరకు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వెంటవెంటనే ఇబ్బందులను పరిష్కరిస్తున్నారు.
- ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలకు అండగా నిలుస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు వెళుతూ గిరిజనులకు కూరగాయలు, ఇతర వస్తువులు అందజేస్తున్నారు. ఈమె సేవలను గవర్నర్ తమిళిసై ప్రశంసించారు.
- ఓరుగల్లులో జడ్పీ ఛైర్ పర్సన్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, ఎంపీపీలు, సర్పంచులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కరోనా వేళ వారంతా ధైర్యంగా క్షేత్రస్థాయికి వచ్చి తమ వంతు సేవలు అందిస్తున్నారు. కొందరు మహిళా సర్పంచులు స్వయంగా గ్రామాల్లో రసాయన ద్రావణాలు పిచికారీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఒక సర్పంచి చేస్తున్న సేవలను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.
వరంగల్ రూరల్, జనగామ కలెక్టర్లు హరిత, నిఖిల, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి కొవిడ్-19 కట్టడికి నిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. క్వారెంటైన్, పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
రూరల్ జిల్లా గ్రీన్ జోన్‌గా ఉంది. జనగామలో తొలుత రెండు కేసులు నమోదు కాగా, ఇటీవల ఆ ఇద్దరు డిశ్ఛార్జి కావడం వల్ల ప్రస్తుతం కేసుల సంఖ్య సున్నాగా ఉంది. వరంగల్ అర్బన్‌లో కమిషనర్ సంచార నిషేధ ప్రాంతాల్లో కూరగాయల అందజేత, శానిటైజేషన్, తదితర పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
ఎంతో అప్రమత్తంగా..
వరంగల్ అర్బన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితా దేవి కొవిడ్-19ని ఎదుర్కొనేందుకు ప్రణాళికతో ఉన్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో కేసులు రాగా, వారి నుంచి మరొకరికి సోకకుండా కట్టడి చేస్తున్నారు. క్వారెంటైన్‌లో ఉన్న వారిని పరిశీలించడం, ఐసోలేషన్ వార్డులను పర్యవేక్షించడం, రోజూ పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, పాజిటివ్ వస్తే సంచార నిషేధిత ప్రాంతాలకు వెళ్లి కట్టడి చేయడానికి సూచనలివ్వడం లాంటి పనులు నిర్వహిస్తున్నారు.