MGNREGA Sarpanch: గ్రామాభివృద్ధి పనులకు చేసిన అప్పులు తీర్చలేక ఓ సర్పంచ్ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో దంపతులిద్దరూ కూలీలుగా మారారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్త గ్రామపంచాయతీ విశ్వనాధకాలనీకి సర్పంచ్‌గా వల్లెపు అనిత ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, పల్లె ప్రగతి పనులకు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. పనులు సకాలంలో పూర్తి చేసినా బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కాస్త పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని సర్పంచ్ అనిత వాపోయారు. అందుకే ప్రతిరోజూ ఉపాధి హామీ పనికి భర్తతో కలిసి వెళుతున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకూ చేపట్టిన పనులకు సంబంధించి రూ. 8 లక్షల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి నెలకు వచ్చే రూ. 40 వేల నిధులను సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బిల్లులు, ట్రాలీ ఈఎంఐ, డీజిల్ ఖర్చులకూ సరిపోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పెండింగ్ బిల్లులు ఇప్పించాలని సర్పంచ్ అనిత కోరుతున్నారు.