Road Widening issue in Parakala: గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ఎవరైనా సంతోషిస్తారు. తమ గ్రామంలో కావాల్సిన నూతన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పిస్తే ఆనందిస్తారు. అందుకు సంబంధిత ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని మెచ్చుకుంటారు. కానీ.. హనుమకొండ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం రోడ్డు విస్తరణ పనుల్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ రోడ్డు మాకొద్దు బాబోయ్ అంటూ అక్కడే బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కామారం గ్రామస్థులు తమ ఊరిలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు ఆపాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. బస్సు, భారీ వాహనాలు రాని ఆ గ్రామంలోకి 50 ఫీట్ల రోడ్డు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎలాంటి రద్దీ లేని గ్రామంలో రోడ్డు విస్తరణ పేరిట తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. మౌలిక వసతుల కోసం గ్రామ అభివృద్ధికి సహకరిస్తాం కానీ.. దాని పేరుతో తమకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
కామారం గ్రామం నుంచి పెంచికలపేటకు వెళ్లే దారి.. గతంలో 18 ఫీట్లు వెడల్పు ఉండేది. ఈ రోడ్డును విస్తరించాలని అధికారులు అనుకున్నారు. ప్రస్తుతం దాన్ని ఇప్పుడు 50 ఫీట్లకు విస్తరిస్తున్నారు. దీని వల్ల తమ ఇళ్లను కోల్పోతున్నామని కొందరు అంటే... రోడ్డుకు ఆనుకుని ఉన్న తమ జీవనోపాధి దెబ్బతింటుందని మరి కొందరు ఆందోళన చెందుతున్నారు. కనీసం బస్సు సౌకర్యం, ఎలాంటి రద్దీ లేని ఈ గ్రామంలో ఆ మేరకు రోడ్డు విస్తరించడం అనవసరం అంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తున్నారు.