కరోనా వైరస్ ప్రభావంతో విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. వారిలో ఉన్న సృజనాత్మక ఆలోచనలను పక్కన బెట్టారు. ఆలోచనలు పక్కదారి పట్టకుండా ఉండటానికి ...ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యం ఇస్తే అందరికీ చేరువయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో గ్రామీణ అధ్యయన కేంద్రాలు(వీఎల్‌సీ)ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాలోని ఏడు సాంఘిక గురుకుల పాఠశాలల పరిధిలో ప్రారంభించారు. విద్యార్థులను బృందాలుగా విభజించి పంచాయతీ కార్యాలయాలు, ఇతర భవనాలు, చదువుకు అనువుగా ఉండే గృహాల్లో వీటిని ఏర్పాటు చేశారు. శానిటైజర్లు వినియోగిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి గురుకులాల ఉపాధ్యాయులు మానిటరింగ్ చేస్తూ, గురుకులాల్లో చదివి డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులను, స్వేరో సంఘాలను భాగస్వాములను చేసి తరగతులను కొనసాగిస్తున్నారు.
- జిల్లాలో గురుకుల పాఠశాలలు 7
- విద్యార్థుల సంఖ్య 4080
- అధ్యయన కేంద్రాలు 173
- కేంద్రాల్లో విద్యార్థులు 536
రోజుకు మూడు గంటల పాటు...
ఒక్కో గ్రూపులో 5 నుంచి 10 మాత్రమే విద్యార్థులను ఎంపిక చేశారు. అధ్యయన కేంద్రాల్లో రోజుకు మూడు గంటల పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. రెండు సర్కిళ్లకు ఒక ఉపాధ్యాయున్ని పర్యవేక్షణ నిమిత్తం నియమించారు.
తల్లిదండ్రుల సహకారంతోనే పేద విద్యార్థులు చదువుకు దూరంగా ఉండకుండా ఉండటానికి ఈ కేంద్రాలు దోహదపడుతున్నాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గత నెలలో తల్లిదండ్రుల సమక్షంలో పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేశారు.