Vigilance and Enforcement Inspect Kaleshwaram Project on Third Day :కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు, నేడు కూడా జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ప్రాజెక్టు కార్యాలయాల్లో విలువైన పత్రాలు, రికార్డులను అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకుంటున్నారు.
Kaleshwaram Project in Telangana : గత రాత్రి కూడా మేడిగడ్డ(Medigadda) అతిథి గృహంలోనే బస చేసిన అధికారులు ఈ ఉదయం తిరిగి మహదేవ్ పూర్ నీటి పారుదల శాఖ కార్యాలయానికి విచ్చేసి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం పది మంది పాల్గొన్నారు. కాళేశ్వరం పంప్ హౌజ్(Kaleshwaram Pump House), మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాలు, సామర్థ్యానికి సంబంధించిన దస్త్రాలు, పునరుద్ధరణ పనులు, చెల్లింపులు మొదలైన అంశాలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా ఓ మినీ ట్రక్కు సరిపడా దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రంతో తనిఖీలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం.
హైదరాబాద్‌కు కీలక దస్త్రాలు తరలింపు : ఈ సోదాల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుని, హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు. మూడు రోజులపాటు సుదీర్ఘంగా సాగిన సోదాల్లో అధికారుల బృందం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లకు చెందిన కీలక పత్రాలు జప్తు చేశారు. పది మంది తనిఖీల్లో కాళేశ్వరం పంపుహౌజ్, మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) నిర్మాణాలు, సామర్థ్యానికి సంబంధించిన దస్త్రాలు, పునరుద్ధరణ పనులు, చెల్లింపులు మొదలైన అంశాలకు చెందిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రమేశ్ వెల్లడించారు.