Various Road Accidents in Joint Warangal District : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకేరోజు జరిగిన మూడు రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపాయి. ఈ ఘటనల్లో తాతా మనువరాలితో పాటు ఇద్దరేసి అన్నదమ్ముల చొప్పున నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంత సాగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో... సోదరులు అశువులు బాశారు. హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణ అన్నదమ్ములు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇద్దరూ ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వెలుతుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. చేతికందివచ్చిన బిడ్డలకు త్వరలోనే పెళ్లి చేద్దామనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలను రోడ్డు ప్రమాదం అడియాసలు చేసింది. ఇద్దరు కుమారులు విగతజీవులడంతో.. వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
కానరాని లోకాలకు కన్నకొడుకులు: కరీంనగర్ జిల్లా కందుగులకు చెందిన 'మనోహర్ -శారద' దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు శివరాం ఇటీవలే దక్షిణ మధ్య రైల్వేలో ఐటీ ఉద్యోగం సాధించి హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నాడు. చిన్నకుమారుడు హరికృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సెలవులు ఉండటంతో ఇంటికి వెళ్లిన శివరాం తన తమ్ముడు హరికృష్ణతో కలిసి తెల్లవారుజామున 5గంటల సమయంలో ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలోనే హనుమకొండ జిల్లా అనంతసాగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు.. ఇద్దరూ జీవితంలో స్థిరపడటంతో మరికొన్ని రోజుల్లోనే వివాహం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే జరిగిన ఈ విషాద ఘటన ఆ దంపతులకు తీరని వేదనను మిగిల్చింది. బిడ్డల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్న తీరు అక్కడున్న వారిచే కన్నీరు పెట్టించింది.
ఆర్టీసీ బస్సు ఢీకొని తాతా మనువరాలు:భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతామనువరాలు చనిపోయారు. గణపురం మండలం సీతారాంపురానికి చెందిన నరాల సమ్మయ్య తన కుమార్తె గ్రామం లో జరుగుతున్న బొడ్రాయి పండుగకు మనవరాలు అక్షితతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో హనుమకొండ వెళ్లే ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొనగా ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.