Crops Damaged in Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు, వడగండ్ల వానలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. నిన్నటి వరకూ ఏపుగా పెరిగి కళకళలాడిన వరి.. ఈదురుగాలులు, రాళ్ల వానలతో గింజన్నదే లేకుండా పోయింది. చేలన్నీ చేతికందకుండా పోయాయి. జనగామ జిల్లాలో వర్షాలకు వరి పైరు అధికంగా దెబ్బతింది. ఇప్పటికీ.. నీళ్లలోనే చేలన్నీ నానుతున్నాయి. ఈదురుగాలుల ఉద్ధృతికి నేలకొరిగిన పంటను చూసి అన్నదాత దిగాలు చెందుతున్నాడు. మక్క పంట చాలా చోట్ల దెబ్బతింది. మట్టిలో కలిసిపోయిన మక్కలు ఎందుకూ పనికిరావని కర్షకులు ఆవేదన చెందుతున్నారు.
బస్తాల్లో ధాన్యానికి మొలకలు.. తడిసిన పంటను కొనే దిక్కులేదు: జనగామ జిల్లాలో 10 వేల ఎకరాల్లో వరి, 232 ఎకరాల్లో మక్కలు.. వెయ్యి ఎకరాల్లో మామిడికి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. హనుమకొండలో 21 వేలు, వరంగల్‌లో 10 వేలు, మహబూబాబాద్‌లో 11 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అంచనా వేశారు. అంతా సజావుగా ఉంటే మరో వారంలో కోతలు మొదలై ధాన్యం అమ్ముకునేవారు. ముందుగా పంట కోసుకున్న కర్షకులు.. కొనుగోలు కేంద్రాల్లో పంట తడిసిపోయి నష్టపోయారు. బస్తాల్లో ఉన్న ధాన్యానికి మొలకలు వస్తున్నాయని.. తడిసిన పంటను కొనే దిక్కులేదని అన్నదాతలు వాపోతున్నారు.
రోడ్డెక్కిన రైతులు.. యత్రాంగం తీరుపై నిరసన: ఇంత నష్టం జరిగినా.. కల్లాల్లు, పొలాల్లోకి అధికారులు వచ్చిన పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. చాలాచోట్ల రోడ్డెక్కిన రైతులు.. యంత్రాంగం తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు రాక అప్పుల్లో కూరుకుపోయామని ప్రభుత్వమే సాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్ధితి మరీ దయనీయంగా మారింది. 80 శాతం మేర పంట నష్టపోయామని వాపోతున్నారు. వరి కోత యంత్రాలు, ట్రాక్టర్ల ఖర్చు తడిసి మోపెడవుతోందని అంటున్నారు. మళ్లీ వర్షాలు కురుస్తాయని భయపడి ఆగమేఘాలపై కొందరు పంటను కోస్తున్నారు.