Crop Losses Due To Hailstorm In Telangana: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు వందల ఎకరాల్లో వరి తుడిచి పెట్టుకుపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి ధాన్యం వడగళ్ల ధాటికి పొలాల్లోనే రాలిపోయింది. యాసంగిలో ఆలస్యంగా నాట్లు వేసుకున్న రైతులు నిండా మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో సరైన ధర లేదని మామిడి కాయలను తెంపకుండా చెట్లపైనే ఉంచిన రైతుల ఆశలు ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి.
Crops Down Due to Hailstorm: కొన్ని చోట్ల చెట్లతో సహా నేల కులాయి. చొప్పదండి మండలం చాపకుంటలో మిరప తోటలు ధ్వంసమయ్యాయి. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో రైతుల ధాన్యం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువలోకి కొట్టుకుపోయింది. పలు చోట్లు తూకం కోసం నిల్వ చేసిన ధాన్యం సైతం తడిసి ముద్దైంది. పంట నష్ట ప్రభావిత ప్రాంతాలను మంత్రి గంగుల పరిశీలించి రైతులకు భరోసా నింపారు. ప్రకృతి సహకరించకపోయినా సీఎం కేసీఆర్ ఆదుకుంటారని రైతులు అధైర్యపడొద్దన్నారు.
మామిడి రైతులకు తీవ్ర నష్టం: హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న మిర్చి పంటలు నేల వాలాయి. భీమదేవరపల్లి మండలంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలంలో వరి ధాన్యం నేల రాలటంతో పాటు కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. జనగామ, బచ్చన్నపేట మండలాల్లో నష్టపోయిన పంట నష్టాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిశీలించారు.
ఎండిన ధాన్యం తడిసిపోయింది:పంట నష్టం వివరాలు సేకరించాల్సిందిగా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నమిలికొండలో ఐకేపీ కేంద్రం ప్రారంభించినా కొనుగోలు చేపట్టకపోవటంతో ఎండిన ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం రంగు మారటం కాకుండా.. ఆరబెట్టాడానికి వాతావరణం అనుకూలించట్లేదని చెబుతున్నారు. ప్రభుత్వమే ఈ ధాన్యాన్ని కొనుగోలు ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.