వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి నేడు వరంగల్ పట్టణ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో వెళ్తునున్న కిషన్ రెడ్డి.. తొలుత ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని... దర్శించుకుంటారు. అనంతరం కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత హృదయ్ పథకం కింద చేపట్టిన భద్రకాళీ బండ్, జైన మందిరం పనులను పర్యవేక్షించనున్నారు. ఆనంతరం రైల్వే అధికారులతో సమావేశంతోపాటు... హృదయ్, స్మార్ట్ పథకాల పురోగతిపై అధికారులతో కిషన్ రెడ్డి సమీక్షించనున్నారు.
వికసింపచేయడమే లక్ష్యం
అధికారిక కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీవీఆర్ గార్డెన్‌లో జరిగే జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నగరానికి అందుతున్న సాయంపై నేతలకు వివరించి చెప్పనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే అధికార తెరాస వైఫల్యాలను వివరించి... మెజార్టీ డివిజన్లలో కమలం పార్టీని వికసింపచేయడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రణాళికబద్దంగా పనిచేస్తే విజయం ఎలా సాధించవచ్చో తెలియచెబుతూ వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారని పార్టీ నేతలు వెల్లడించారు.