Sanskriti mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి వరంగల్ వేదికైంది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేడుకలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల కళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ బ్యాటరీ కారులో వెళ్లి వీక్షించారు. తమ ప్రాంత వేషధారణలు, కట్టుబొట్టుతో వచ్చిన కళాకారులతో కలసి ఫోటోలు దిగారు. డప్పు వాయించి వారితో నృత్యం చేశారు.
దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్ర్య సమరయోధులే నిజమైన హీరోలని గవర్నర్ తమిళిసై కీర్తించారు. నాటి మహానీయుల త్యాగాలను నేటి తరం నిరంతరం గుర్తుంచుకోవాలని ఉద్బోధించారు. చారిత్రక నగరి ఓరుగల్లు జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమన్నారు.
దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులందరికీ సెల్యూట్ చేస్తున్నా. వారి పోరాటాల వల్లే దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నారు. స్వాతంత్ర్యం తెచ్చిన మహానీయుల త్యాగాలను మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ఏడాదంతా జరుపుకుంటున్నాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మన సంస్కృతి ఐక్యతను చాటుతుంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ మౌలికసూత్రం.