kishan reddy speech in hanamkonda sabha: మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని తెలిపారు. రహదారుల కోసం మొత్తం రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్న ఆయన.. యాదాద్రి నుంచి వరంగల్‌కు రూ.388 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించిందని గుర్తు చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.196 కోట్లు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా మరో రూ.196 కోట్లను కేసీఆర్ ఇవ్వలేదని ఆరోపించారు. వరంగల్‌లో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ధి చేస్తానని గతంలో పేర్కొన్న కేసీఆర్.. ఫామ్‌హౌజ్‌ను వీడింది లేదు, వరంగల్‌లో అభివృద్ధి చేసింది లేదని దుయ్యబట్టారు. వరంగల్ జిల్లాలోని ఆలయాలనూ కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. కూలిపోయే దశలో ఉన్న కాకతీయుల కళా మండపాన్ని పట్టించుకోలేదన్న కిషన్‌రెడ్డి.. ఆ మండపాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆధునీకరిస్తోందని తెలిపారు.
భాజపాను గెలిపిస్తే మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుంది..: వరంగల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్‌ను మంజూరు చేసిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సైనిక్ స్కూల్ నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం భూమి కేటాయించటం లేదని ఆరోపించారు. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భాజపా అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కిషన్‌రెడ్డి.. భాజపాను గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తోంది. వరంగల్‌లో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను వీడింది లేదు, వరంగల్‌లో అభివృద్ధి చేసింది లేదు. వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.196 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా మరో రూ.196 కోట్లను కేసీఆర్ ఇవ్వలేదు. వరంగల్ జిల్లాలోని ఆలయాలను కేసీఆర్ పట్టించుకోలేదు. కూలిపోయే దశలో ఉన్న కాకతీయుల కళామండపాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆధునీకరిస్తోంది. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. భాజపా అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. భాజపాను గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుంది. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి