తెలంగాణ

telangana

ETV Bharat / state

కేయూ ఉపకులపతి నియామకంపై తొలగని ప్రతిష్ఠంభన - కేయూ ఉపకులపతి నియామకం

కాకతీయ విశ్వవిదాలయం 13వ ఉపకులపతి నియామకంపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. గత ఏడాది జులై 25న వీసీ పదవీకాలం పూర్తి అయినా.. వర్సిటీ ఉపకులపతి నియామకపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో పదకొండు నెలలుగా ఇన్‌ఛార్జి పాలన కొనసాగుతోంది... మరోవైపు వర్సిటీలో నిధుల లేమితో అభివృద్ధి ఆగిపోయింది..

Undisputed deadlock on appointment of KU vice-chancellor
కేయూ ఉపకులపతి నియామకంపై తొలగని ప్రతిష్ఠంభన

By

Published : Jul 2, 2020, 9:28 AM IST

కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా మూడేళ్ల పాటు విధులు నిర్వహించిన ఓయూ భౌతికశాస్త్రం విశ్రాంత ఆచార్యులు ఆర్‌.సాయన్న పదవీకాలం గత ఏడాది జులై 25వ తేదీతో ముగిసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డిని ఇన్‌ఛార్జి ఉపకులపతిగా నియమించారు. రాష్ట్రంలో తొమ్మిది విశ్వద్యాలయాలకు వీసీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే వర్సీటీల పాలకమండళ్ల నియామకాలను కూడా చేపట్టి కేయూతోపాటు రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వీసీ నియమించడం కోసం కసరత్తు ప్రారంభించింది. అర్హుల నుంచి రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. గత ఏడాది జులై తొమ్మిదో తేదీన నియామకాల కోసం ప్రకటన జారీ చేశారు. ఆచార్యులుగా పదేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో సర్వీస్‌లో ఉన్న వారితో పాటుగా విశ్రాంత ఆచార్యులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు.

నోటిఫికేషన్‌పై నీలినీడలు!

కేయూ ఉపకులపతి నియామకం కోసం గత ఏడాది జులై 9వ తేదీన ప్రకటన జారీ అయింది. ఈ నెల 8వ తేదీతో సంవత్సరం పూర్తి అవుతుంది. ఏ ప్రకటన అయినా సంవత్సరం మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని.. ఏడాది గడిస్తే నిబంధనల ప్రకారం చెల్లుబాటు కాదని సీనియర్‌ ఆచార్యులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే నిజమైతే కేయూ ఉపకులపతి నియామకం మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వీసీ నియామకాలను చేపట్టాలని అధ్యాపక, ఉద్యోగ, పరిశోధక, విద్యార్థివర్గాలు కోరుతున్నాయి.

నిధుల లేమితో సతమతం

విశ్వవిద్యాలయానికి సరిపోను నిధులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.89 కోట్లు ఉద్యోగుల వేతనాలకే సరిపోవడం లేదు. మరోవైపు ఉద్యోగుల వేతనాలను ఏడాదికి రూ.130 కోట్ల వరకు అవసరముంటుందని వర్సిటీ అధికారులు అంటున్నారు. నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.

పదకొండు నెలలుగా..

ఉత్తర తెలంగాణలో పెద్ద విశ్వవిద్యాలయమైన ‘కాకతీయ’ను అధ్యాపకుల కొరత, నిధుల లేమి పట్టి పీడిస్తున్నాయి. వీటికి తోడుగా గత ఏడాది 25వ తేదీ నుంచి ఇన్‌ఛార్జి పాలన కొనసాగుతోంది. ఇన్ఛార్జి ఉపకులపతి ఏడాదిలో అయిదుసార్లు మాత్రమే కేయూకు వచ్చారు. ప్రతి పనికి వర్సిటీ అధికారులు హైదరాబాద్‌కు వెళ్లాల్సివస్తోంది.

నిలిచిన ప్రగతి..

రెగ్యులర్‌ వీసీ లేకపోవడంతో కేయూ ప్రగతి అడుగు ముందుకు పడడంలేదు. కేయూలో 275 వరకు అధ్యాపక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంలో మరింత జాప్యం జరుగుతోంది. నాలుగేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం 136 ఉద్యోగాలను భర్తీ చేసుకోవాడానికి అనుమతి ఇచ్చింది. కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల నిలిచిపోయింది. గత ఏడాదిలో భర్తీ చేయడానికి మార్గం సుగమమైనా.. వీసీ లేకపోవడంతో ప్రక్రియ ముందుకు కదల్లేదు. మరోవైపు నాలుగేళ్లుగా పీహెచ్‌డీ ప్రవేశాలు లేక విద్యార్థుల్లో నిరాశ నెలకొంది.

రంగంలో 23 మంది..

కేయూ ఉపకులపతి పోరులో 23 మంది బరిలో ఉన్నారు. 136 మంది వరకు దరఖాస్తులు చేసుకున్నా.. అన్ని పరిశీలించిన అనంతరం 23 మందిని తుది పోరుకు ఎంపిక చేసిట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చిలో వీసీలను నియమిస్తారని ప్రచారం జోరందుకుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అంతకుముందే రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తారని ప్రచారం జరిగింది. కొంత కసరత్తు జరిగినా.. ప్రతిష్ఠంభన తొలగలేదు.

ఇవీ చూడండి: ప్రధానికి ఎంపీ రేవంత్‌ రెడ్డి లేఖ.. ఎందుకో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details