గ్రేటర్ వరంగల్ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవాలనుకుంటున్న అధికార తెరాస.. విపక్షాల కన్నా ముందుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఉగాది పండుగ తరువాత ఒకట్రెండు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలవడవచ్చంటూ ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పార్టీ విస్తృత స్ధాయి సమావేశాన్ని నేతలు అట్టహాసంగా నిర్వహించారు. ఉత్సాహంగా పనిచేసి సభ్యత్వం పూర్తిచేసిన నాయకులు, కార్పొరేటర్లను...ఘనంగా సన్మానించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొని గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
గ్రేటర్ వరంగల్ పీఠంపై తెరాస జెండా ఎగరేయాలి: ఎర్రబెల్లి - telangana varthalu
పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి గ్రేటర్ వరంగల్ పీఠంపై గులాబీ జెండా ఎగరేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వచ్చే నెల 10 లోపు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని... కార్యకర్తలంతా ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండాలని అన్నారు. నగరవాసులకు తాగునీరందించే పథకం ప్రారంభం కోసం ఈ నెల 14న కేటీఆర్ రానున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాకు ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారని... దీంతో ఆ పార్టీది పాలపొంగు అని తేలిపోయిందని ఆక్షేపించారు. 2కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి ప్రజలను భాజపా మోసం చేసిందని... ఆ పార్టీ నేతలకు ఓట్లడిగే అర్హత లేదని దుయ్యబట్టారు. ఇంటింటికీ సంక్షేమాన్ని అందించిన ఘనత తెరాసదేనని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమైక్యంగా పనిచేసి... పార్టీని విజయతీరాలవైపు నడిపించాలని నేతలు ఉద్భోదించారు. గెలుపుగుర్రాలకే టిక్కెట్లని, ఇందుకోసం పార్టీ సర్వే చేస్తోందని నేతలు వెల్లడించారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరులో సాంకేతికత అత్యంత కీలకం: కేటీఆర్