రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్ధానాలపై గురి పెట్టిన అధికార తెరాస అందుకు అనుగుణంగా.. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. అధిష్టానం ఆదేశాలతో నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంత్రులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి,మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గ స్ధానాల్లో ఓటర్ల నమోదు షెడ్యూల్ను త్వరలో ఎన్నికల సంఘం ప్రకటించనుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. రెండు నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని ఆదేశించారు.
కేంద్రంపై ఎర్రబెల్లి ధ్వజం..
ఈ క్రమంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా... పార్టీ నేతలు జోరుగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం వర్ధన్నపేట, వరంగల్ అర్బన్ నియోజకవర్గాల్లో జరిగిన సన్నాహక సమావేశాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిధుల పరంగా కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని... సంక్షేమ పథకాలకు ఇచ్చేది కొంతైతే.. చెప్పుకునేది ఎక్కువగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.