తెలంగాణ

telangana

ETV Bharat / state

MGM INCIDENT: ఎంజీఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు.. - telangana latest news

MGM
MGM

By

Published : Mar 31, 2022, 7:44 PM IST

Updated : Mar 31, 2022, 8:08 PM IST

19:42 March 31

MGM INCIDENT: ఎంజీఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు..

MGM INCIDENT: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలోని రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సూపరింటెండెంట్‌గా చంద్రశేఖర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సూపరింటెండెంట్​తో పాటు ఘటన సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కాగా.. ఎంజీఎం ఆసుపత్రి ఘటనపై మంత్రి హరీశ్​రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ఇదీ జరిగింది..

ఎంతో మంది రోగులకు వరప్రదాయినిగా మారిన వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి... మరికొందరు రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పెద్దాసుపత్రికి వచ్చిన రోగులకు ప్రాణాల మీద ఆశలు లేకుండా చేస్తోంది. ఇటీవల కాలంలో ఎలుకల కారణంగా కొందరు రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అసలే కిడ్నీ, లివర్‌ సమస్యలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాస్‌ అనే రోగి మీద ఎలుకలు రెండ్రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేసి కాళ్లు, చేతుల వేళ్లు కొరికాయి. దీంతో ప్రాణాలు నిలుపుకుందామని ఇక్కడికొస్తే ఇదేం పరిస్థితి అంటూ శ్రీనివాస్‌ బంధువులు వాపోతున్నారు.

ఐసీయూలోనే ఇలా ఉంటే ఎలా?..

ఆయన కిడ్నీ, లివర్​ సమస్యలకు చికిత్సను తీసుకుంటున్నారు. వెంటిలేటర్​పై చికిత్సను పొందాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక స్థోమత సరిగా లేక ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించాం. వైద్యులు చికిత్స చేస్తున్నారు. రాత్రి ఒక అరగంట పాటు పడుకున్నాను. అరగంట తర్వాత లేచి చూస్తే పరిస్థితి భయంకరంగా ఉంది. అతని చేతి వేళ్ల నుంచి రక్తం కారుతూ ఉంది. కింద అంతా రక్తం పడి ఉంది. వైద్యులను కేకలు వేయగా వారు వచ్చారు. ఏమిటని వారిని ప్రశ్నించగా.. ఎలుకలు కొరికాయని తెలిపారు. ఐసీయూలోనే ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించాను.-శ్రీకాంత్‌, బాధితుడి సోదరుడు

రోగుల ప్రాణాలకు భరోసా ఏది?..

ఎలుకలు కొరికిన ఘటనలు తరచూ జరగడం పట్ల రోగుల బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్దాసుపత్రిలో పారిశుద్ధ్యం పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఎంజీఎం ఆసుపత్రి సమస్యలపై దృష్టి సారించి రోగుల ప్రాణాలకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు..

ఐసీయూలో రోగి కాలు, చేతుల వేళ్లు కొరికేసిన ఎలుకలు

Harishrao On MGM Incident: ఎంజీఎం ఘటనపై మంత్రి హరీశ్‌రావు సీరియస్

Last Updated : Mar 31, 2022, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details