తెలంగాణ

telangana

ETV Bharat / state

బుల్లి రోబోలు.. ఆసక్తి కలిగిస్తున్న ప్రయోగాలు! - Robotics Training chindrens in warangal city

కాలం మారుతోంది.. మారుతున్న కాలంతోపాటు మనమూ మారాల్సిందే! ప్రస్తుత పోటీ ప్రపంచంలో చకచకా దూసుకు పోవాలంటే సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. వరంగల్​కు చెందిన సుకన్య ఆమె స్నేహితులు, చిన్నారులకు ఫన్ అండ్ ప్లే పద్ధతిలో రోబోటిక్స్​పై ఆసక్తిని పెంచుతున్నారు. చిన్న వయసులోనే బుల్లి రోబోలను తయారు చేసే విధంగా శిక్షణ ఇస్తున్నారు. ఆ విద్యార్థులు చేసిన రోబోలు జాతీయ స్థాయి పోటీల్లో మెరుస్తున్నాయి.

ఫన్ అండ్ ప్లే పధ్ధతి లో రోబోటిక్స్​పై శిక్షణ

By

Published : Nov 25, 2019, 12:29 PM IST

ఫన్ అండ్ ప్లే పధ్ధతి లో రోబోటిక్స్​పై శిక్షణ

చిన్న వయసులోనే పిల్లలు తెలివితేటలు ప్రదర్శిస్తూ రోబోలతో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. వరంగల్​కు చెందిన సుకన్య ఆమె స్నేహితులు పిల్లలకు రోబోటిక్స్​పై మక్కువ కలిగేలా చేస్తున్నారు. బీఈ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన సుకన్య... చిన్నారులకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలని భావించారు. అందరిలా పాఠశాలలోనో, కళాశాలలో ఉపాధ్యాయురాలిగా చేయడం ఇష్టంలేదు. పిల్లలకు ఇంట్లోనే మంచి శిక్షణ ఇచ్చి.. రోబోటిక్స్​పై అవగాహన పెంచవచ్చని భావించారు. ఇద్దరు బీటెక్ విద్యార్థుల సాయంతో క్రియేటివ్ రోబెటిక్స్ పేరుతో ఓ స్కూల్ ఏర్పాటు చేశారు. ఓ గదిని అద్దెకు తీసుకుని దాన్నే ప్రయోగశాలగా మార్చేశారు.

వారంలో రెండు రోజులు

రోబోటిక్స్ పరిజ్ఞానాన్ని ఏడు భాగాలుగా విభజించి విద్యార్థులకు అందిస్తున్నారు సుకన్య. శని, ఆదివారాలు మాత్రమే తరగతులు చెప్తారు. వేసవిలో నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితం. పుస్తకాల్లో చదువుకున్న దానికంటే అనుభవపూర్వకంగా నేర్చుకున్నది ఎప్పటికీ మరిచిపోరని, అందుకే ప్రాక్టికల్స్​కు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తామని సుకన్య చెబుతున్నారు.

విద్యార్థులు ఔరా అనిపిస్తున్నారు..

శిక్షకులు అందించిన చక్కని శిక్షణతో విద్యార్థులు చిన్న వయసులోనే రోబోలు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అంధులకు దారి చూపే విధంగా స్మార్ట్ హ్యాండ్ ఫర్ బ్లైండ్ రోబో... బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి ఇన్​సెఫ్ రోబోటిక్స్ పోటీలకు ఎంపికైంది. ఇక్కడి విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ డస్ట్​బిన్ అందరి ప్రశంసలందుకుంది. ఫుట్​బాల్ ఆడే బాహుబలి రోబోనూ విద్యార్థులు రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

శని, ఆదివారాలొచ్చాయంటే విద్యార్థులతో ఈ స్కూల్ సందడిగా మారుతుంది. సమాజానికి ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణల కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగంలో పొందలేని సంతృప్తి పిల్లలకు రోబోటిక్స్ విజ్ఞానం అందించడం ద్వారా కలుగుతోందని, వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తున్నామని సుకన్యా, ఆమె స్నేహితులు చెబుతున్నారు.

ఇదీ చూడండి : కేసీఆర్​ హామీ ఇచ్చినా... ఆగని గుర్రంగడ్డ కన్నీటి గోడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details