నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం, ఇక జోరందుకోనున్న ప్రచారం నామినేషన్లు దాఖలు చేయని వారు... మరో సెట్ దాఖలు చేయాలనుకుంటున్న అభ్యర్థులు నేడు నామపత్రాలు సమర్పించనున్నారు. వరంగల్ తెరాస అభ్యర్థి... పసునూరి దయాకర్, భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తితో పాటు మహబూబాబాద్ భాజపా అభ్యర్థి హుస్సేన్ నాయక్ కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు... బరిలో దిగనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉంది. మరోసారి అన్నీ తానై నడిపించనున్న కేసీఆర్ నామినేషన్ల ఘట్టం ముగుస్తుండటం వల్ల ఇక ప్రచార వేడి పెరగనుంది. తెరాస అధినేత కేసీఆర్.. ఏప్రిల్ 2న వరంగల్... ఏప్రిల్ 4న మహబూబాబాద్‌లో బహిరంగ సభలకు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ కోసం రాహుల్ లేదా ప్రియాంక
వరంగల్, మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన దొమ్మటి సాంబయ్య, బలరాంనాయక్ ప్రచారం ముమ్మరం చేయనున్నారు. నర్సంపేట, ములుగు, పినపాక, భద్రాచలం, డోర్నకల్, మహబూబాబాద్‌లో నేటి నుంచి వరుసగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. మహబూబాబాద్, జనగామలో రాహుల్ లేదా ప్రియాంక గాంధీల్లో ఒకరితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు.
అమిత్‌షాతో ఒక్క చోటైనా భారీ సభ నిర్వహించాలి : రాష్ట్ర భాజపా
ఇక భాజపా నుంచి వరంగల్ స్థానానికి చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, ఇవాళ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. నేడు హన్మకొండలో భాజపా శ్రేణుల సన్నాహక సమావేశం జరగనుంది. మహబూబాబాద్‌లోనూ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఒక చోటైనా బహిరంగ సభ నిర్వహించాలని కమల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్ని పార్టీలు తమ అగ్రనేతలతో వచ్చే నెల 9 వరకూ ప్రచారం జోరుగా సాగించనున్నాయి. మండే ఎండలకు తోడు ప్రచార హోరుతో మరింత వేడి పుట్టనుంది.
ఇవీ చూడండి :'ఎన్నికలంటే.. ప్రజాసేవకులే జంకుతున్నారు'