తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీఎం ఆసుపత్రిలో యథేచ్ఛగా చోరీలు... కొరవడిన నిఘా - వరంగల్ అర్బన్ లేటెస్ట్ న్యూస్

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో నిఘా కొరవడింది. సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయడం లేదు. ఆస్పత్రిలోకి ఎవరొస్తున్నారు.. వచ్చినవారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఏం చేస్తున్నారనే విషయంలో సరైన నిఘా లేదు. ఫలితంగా వరుసగా దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి.

Theft in mgm hospital in warangal urban
ఎంజీఎం ఆసుపత్రిలో యథేచ్ఛగా చోరీలు... కొరవడిన నిఘా

By

Published : Nov 3, 2020, 12:40 PM IST

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వరుస చోరీలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా పని చేయక నిఘా కొరవడింది. శిశువులను రాత్రివేళ ప్రధాన గేటు నుంచి తీసుకొచ్చి వదిలేసి వెళ్తున్నా వారెవరని ప్రశ్నించేవారు కరవయ్యారు. ఆస్పత్రికి వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చేవరకు సెక్యూరిటీ సిబ్బందికి, పీఆర్‌వోలకు, అధికారులకు తెలియడం లేదు. రెండు రోజుల క్రితం ఏఎంసీలో చికిత్స పొందుతున్న బాధితురాలిని చూసేందుకు వచ్చిన వారి రూ.22 వేల విలువైన సెల్‌ఫోన్‌ చోరీకి గురైంది. ఎంజీఎం సూపరింటెండెంట్‌కు ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలోని సర్జికల్‌ వైద్య విభాగం సెమినార్‌ హాల్‌లో కంప్యూటర్‌, రెండు టీవీలు, హోం థియేటర్‌ తదితర రూ.లక్ష విలువైన వస్తువులు అపహరించారు. వైద్యుల విభాగంలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల చోరీకి పాల్పడిన వారిని గుర్తించడం ఇప్పుడు పోలీసులకు కష్టంగా మారింది. ఆసుపత్రిలో సుమారు 60కి పైగా సీసీ కెమెరాలున్నా అందులో చాలా వరకు పని చేయడంలేదు. అక్కడక్కడ నిఘా ఉందని బోర్డులున్నాయే గానీ కెమెరాలు కనిపించడంలేదు. రాత్రివేళ నిఘా పెట్టాల్సిన వారు అందుబాటులో ఉండటం లేదు. రాత్రి వేళ నాలుగో తరగతి ఉద్యోగుల పర్యవేక్షణను చూసే సార్జంట్‌లు, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌, శానిటేషన్‌ ఉద్యోగుల పర్యవేక్షణను చూసే ప్రైవేటు ఏజన్సీ సిబ్బంది పగలు చూపిన శ్రద్ధ... రాత్రి వేళ చూపనందునే దొంగతనాలు జరుగుతున్నాయి.

ఆవరణ అంతటా ఉంటేనే..

ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఆస్పత్రికి రోజూ 2000 మంది పైగా రోగులు ఓపీ వైద్య సేవల కోసం వస్తుంటారు. సుమారు 600మంది ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతారు. వీరందరితో పాటు ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి, మానిటరింగ్‌ చేయడానికి ఆస్పత్రిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రధాన గేట్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓపీ, అత్యవసర విభాగాల్లో, మెడికల్‌ స్టోర్స్‌, కొవిడ్‌ వార్డుతోపాటు ఇతర వార్డుల్లో, సూపరింటెండెంట్‌ గది వద్ద ఉన్నాయి. సూపరిండెంటెంట్‌ ఛాంబర్‌లో వీటన్నిటినీ పర్యవేక్షించి చర్యలు తీసుకునేలా మానిటర్లు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాలు చాలా వరకు పనిచేయడం లేదు. ఇదే అదనుగా ఆస్పత్రిలోని వారే అవి పనిచేయని దారులను గుర్తించి కంప్యూటర్లు, ఇతర వస్తువులు తీసుకెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి అన్ని వేళలా పనిచేసేలా చర్యలు తీసుకుంటే చోరీలను నివారించవచ్చని పోలీసు వర్గాలంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details