SSC Paper Leakage Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కావడం.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అవడం తెలిసిన విషయమే. ఈ నెల 4న హనుమకొండలోని కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో బయటకు వచ్చిన ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావించి ఏ1గా పేర్కొంటూ పోలీసులు బండి సంజయ్‌పై నేరపూరిత కుట్ర, మోసం, మాల్ ప్రాక్టీస్ తదితర కేసులు నమోదు చేశారు.
నేడు హైకోర్టు విచారణ..:అనంతరం అరెస్ట్ చేసి ఈ నెల 6న హనుమకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మెజిస్ట్రేట్ ఆదేశాలతో ఆయనను రిమాండ్‌పై కరీంనగర్ జైలుకు తరలించారు. అనంతరం సుదీర్ఘ వాదనల అనంతరం హనుమకొండ మెజిస్ట్రేట్ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయగా.. 7న ఉదయం ఆయన కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. తన అరెస్ట్ అక్రమమని.. మెజిస్ట్రేట్ జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను రద్దు చేయాలన్న సంజయ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణను నేటికి వాయిదా వేశారు. దీంతో సంజయ్ రిమాండ్ రద్దుపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.
ఈటలకు నోటీసులు..: ఇక ఇదే కేసుకు సంబంధించి హుజూరాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ ఇప్పటికే పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు. ఏ2 గా ఉన్న బూర ప్రశాంత్.. వాట్సప్‌లో ప్రశ్నపత్రాన్ని ఈటలకూ పంపారని పోలీసులు పేర్కొంటూ ఆయనకు నోటీసులిచ్చారు. ఈ నెల 7 ఉదయం 11 గంటలకు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోరగా.. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన దృష్ట్యా.. సోమవారం హాజరవుతానని ఈటల తెలియజేశారు.
హనుమకొండకు రానున్న ఈటల..:తనకు సాక్షిగా నోటీసు ఇచ్చారని.. విచారణకు హాజరై వాంగ్మూలం ఇస్తానని ఈటల ఇప్పటికే తెలియజేశారు. ఇదే కేసులో ఈటల ఇద్దరు పీఏలకు కూడా నోటీసులు జారీ చేయగా వారిద్దరూ (రాజు, నరేందర్) శుక్రవారం నాడే సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయానికి వచ్చారు. కమలాపురం సీఐ సంజీవ్ పలు కోణాల్లో వీరిని విచారించారు. ఈ సందర్భంగా వారిద్దరూ.. లిఖిత పూర్వకంగా వివరణను అందజేశారు. ఇదే కేసులో మరికొందరికీ వరంగల్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అందరినీ విడతల వారీగా విచారించనున్నారు.
పరీక్షకు హాజరైన హరీశ్..:ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ఉన్నతాధికారులు విద్యార్థి హరీశ్‌ను 5 సంవత్సరాల పాటు డిబార్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు అన్యాయం జరిగిందంటూ హరీశ్ హైకోర్టును ఆశ్రయించగా.. పరీక్షలు రాసేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో నేడు జరిగిన సైన్స్ పరీక్షకు హరీశ్ హాజరయ్యాడు.
ఇవీ చదవండి: