మహిమల మారాజు మల్లన్న జాతర మూడో రోజు కన్నుల పండువగా సాగింది. బుధవారం మకర సంక్రాంతి సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు చేశారు. మూడోరోజు రాత్రి ప్రత్యేకంగా ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు నిర్వహించి స్వామికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిఏటా ఎడ్లబండ్లపై వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంటుందంటున్నారు. రంగురంగుల విద్యుత్ వెలుగుల్లో యువత కేరింతలు కొట్టారు. భక్తి పాటలు, సాంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.
శివసత్తుల నృత్యాలు
కోర మీసాల మల్లన్న స్వామి జాతర ఆద్యంతం కోలాహలంగా జరుగుతోంది. స్వామిని దర్శించుకోవడానికి గంటలసేపైనా లెక్కచేయక.. క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ఆలయ పరిసరాల్లోనే విడిది చేస్తూ... నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తూ.. స్వామికి నైవేద్యాలు సమర్పించారు. భక్తిపారవశ్యంతో మమ్మేలు మల్లన్నా... శరణు మల్లన్నా అంటూ చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగుతున్నాయి. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్నను స్తుతించారు. ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలు, పూనకాలు హోరెత్తుతున్నాయి.