కొత్త డివిజన్ల పునర్విభజన ప్రక్రియ మొదలుపెట్టాలంటూ... పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయటం వల్ల గ్రేటర్ వరంగల్ పరిధిలో డివిజన్ల పునర్విభజనకు కార్యాచరణ మొదలైంది. గతంతో పోలిస్తే ఈసారి మరో 8 కలుపుకుని మొత్తం 66 డివిజన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. కలెక్టరేట్ నుంచి 2021 తుది ఓటర్ల జాబితాను ఇప్పటికే అధికారులు తీసుకున్నారు.
పెరిగిన డివిజన్లు...
డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. డివిజన్ల పునర్విభనకు గతంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో... ఈసారి అవే పాటించనున్నారు. డివిజన్ల సంఖ్య పెరగడం వల్ల కొత్త వాటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనాభా ప్రాతిపదికన వరంగల్ తూర్పు, పశ్చిమల్లో మూడేసి, వర్ధన్నపేట నియజకవర్గ పరిధిలో రెండు డివిజన్లు పెరిగే అవకాశాలున్నాయి. ఎన్నికలు సమీపించటం వల్ల అన్ని రాజకీయ పార్టీలు... గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.
ఢీ అంటే ఢీ...
తెరాస, భాజపా పార్టీలు... ఢీ అంటే ఢీ అనేలా తమ కార్యచరణ ప్రారంభించాయి. ఆది నుంచి అభివృద్ధే తారకమంత్రంగా... భావించిన తెరాస... అదే ఏజెండాతో ఎన్నికలకు వెళ్లి గెలుపు సాధించాలని భావిస్తోంది. అందులో భాగంగానే నగర పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సంకల్పించారు. తాజాగా నగరాభివృద్ధికి రూ. 250 కోట్లు విడుదలయ్యాయి. నగరంలో రహదారుల విస్తరణ, సుందరీకరణ పనులు, తాగునీటి సరఫరా పనులు త్వరగా పూర్తిచేస్తే ఎన్నికల్లో తమకు లాభించగలదన్నది గులాబీ నేతల అభిప్రాయం.
సిట్టింగ్లను మార్చే యోచన...
నగరవాసులకు ఆహ్లాదం కలిగించే భద్రకాళి బండ్... ఆధ్యాత్మికతను పంచే అగలయ్య గుట్ట, జైనమందిర పనులు పూర్తై ప్రారంభాలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పూర్తైన రెండు పడకగదులను త్వరలోనే లబ్ధిదారులకు అందించనున్నారు. పెండింగ్ పనులు పూర్తయ్యాక... మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ అభ్యర్థుల్లో కొందరిని మారుస్తారనే... ప్రచారమూ జరుగుతోంది. సర్వే ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.