Lawyer mallareddy Murder case:ములుగులో న్యాయవాది మల్లారెడ్డి హత్య సంఘటనను రాష్ట్ర హైకోర్టు బుధవారం సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి స్వీకరించింది. హైకోర్టు బార్ అసోసియేషన్ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు చేసిన వినతి మేరకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, ములుగు ఎస్పీ, ఎస్‌హెచ్‌వోలను చేర్చింది.
ప్రత్యేక చట్టం అవసరం: బార్ కౌన్సిల్..న్యాయవాదుల రక్షణ నిమిత్తం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రజల హక్కుల పరిరక్షణకు విధులు నిర్వహించే న్యాయవాదులకు రక్షణ కల్పించేలా చట్టాన్ని తీసుకురావాలంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి కోరారు. వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాది ఎం.మల్లారెడ్డిని ములుగులో కిరాతకంగా హత్య చేయడాన్ని ఖండించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి త్వరగా నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..హనుమకొండకు చెందిన న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి (58) ఈ నెల 1న దారుణ హత్యకు గురయ్యారు. భూ సమస్యపై ములుగు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సోమవారం సాయంత్రం 6.30 సమయంలో తిరిగి హనుమకొండకు వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కారు డ్రైవర్ సారంగం, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం పందికుంట బస్ స్టేజీ సమీపంలో స్పీడు బ్రేకర్ల వద్ద మల్లారెడ్డి వాహనాన్ని వెనుక మరో కారులో వస్తున్న నిందితులు ఢీకొట్టారు. న్యాయవాది వాహనం దిగి ఎందుకు ఢీ కొట్టారని అడగగా.. అందులో ఒక వ్యక్తి వచ్చి క్షమించాలని కోరాడు.
దీంతో సరేనని న్యాయవాది తన కారు ఎక్కి డోరు వేసుకుంటుండగా మరో నలుగురు వచ్చారు. వారిలో ముగ్గురు వ్యక్తులు న్యాయవాదిని కారులో నుంచి కిందకు లాగి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. అక్కడే ఉన్న డ్రైవర్‌ను మరో ఇద్దరు వ్యక్తులు కదలకుండా పట్టుకున్నారు. అనంతరం ఐదుగురు నిందితులూ అదే కారులో పరారయ్యారు. ఘటనా స్థలాన్ని ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి పాటిల్, ఏఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్, ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ములుగు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు సోమవారం రాత్రి వెల్లడించారు.