తెలంగాణ

telangana

ETV Bharat / state

Ramappa: వారసత్వ హోదా తర్వాత ఆలయ అభివృద్ధికి మొదటి అడుగు

ప్రపంచ వారసత్వ హోదా వచ్చిన తరువాత రామప్ప ఆలయ అభివృద్ధి కోసం మొదటి అడుగు పండింది. యునెస్కో నియమ నిబంధనలకు అనుగుణంగా భూగర్భ (అండర్‌ గ్రౌండ్‌) విద్యుత్తు లైన్‌ ఏర్పాటుకు ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి.

Ramappa
రామప్ప

By

Published : Sep 5, 2021, 7:15 PM IST

యునెస్కో గుర్తింపు వచ్చి నెల రోజులు దాటినా ఎలాంటి పురోగతి లేదని చింతిస్తున్న వారికి తీపి కబురు అందింది. ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా విద్యుత్తు దీపాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం పూనుకుంది. ప్రపంచ వారసత్వ హోదా వచ్చిన తరువాత ఆలయ అభివృద్ధి కోసం మొదటి అడుగు పండింది. యునెస్కో నియమ నిబంధనలకు అనుగుణంగా భూగర్భ (అండర్‌ గ్రౌండ్‌) విద్యుత్తు లైన్‌ ఏర్పాటుకు ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. పురావస్తుశాఖ రూ. 26 లక్షల నిధులను విద్యుత్తుశాఖ ఖాతాకు బదిలీ చేయడంతో గుత్తేదారు గురువారం పనులను మొదలుపెట్టారు. మున్ముందు మరిన్ని పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో మంచి రోజులు రానున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నియమాలకు లోబడి..

రామప్ప యునెస్కో జాబితాలో చేరాలంటే కట్టడానికి 300 మీటర్ల పరిధిలో ఎలాంటి విద్యుత్తు స్తంభాలు, తీగలు, నియంత్రికలు కనిపించరాదు. గతంలో ఐకోమాస్‌ ప్రతినిధి వాసుపోశ్యనందన వచ్చిన సందర్భంగా ఆలయం వద్ద ఉన్న విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలు, తీగలను పూర్తిగా తొలగించారు. ఆయన పరిశీలన సమయంలో ఆలయం బయట ఒక జనరేటర్‌ను ఏర్పాటు చేసి తాత్కాలికంగా భూమిపై వైర్లు పరిచి విద్యుత్తు సరఫరా చేశారు. తదనాంతరం ఆలయానికి ఒక ప్రత్యేక విద్యుత్తు తీగతో దీపాలు ఏర్పాటు చేశారు. యునెస్కో గుర్తింపు రావడంతో అధికారులు అండర్‌గ్రౌండ్‌ పనులు చేయడం కోసం ప్రతిపాదనలు పంపడంతో నిధులు కేటాయించారు. గుత్తేదారు యునెస్కో నియమాలకు అనుగుణంగా కందకాలను తీయడం మొదలు పెట్టాడు.

రెండేళ్ల క్రితమే నిధులు మంజూరైనా..

విద్యుత్తు శాఖ నియమాలకు అనుగుణంగా భూగర్భ విద్యుత్తులైను, దీపాలను, విద్యుత్తు నియంత్రికలను ఏర్పాటు చేయడం కోసం రూ.20లక్షలు, అంతకు ముందు ఉన్న స్తంభాలు, వైర్లను, నియంత్రికలను తొలగించడం కోసం రూ.6 లక్షలు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2019 సెప్టెంబరులో పురావస్తుశాఖకు నిధులు మంజూరయ్యాయి. అప్పటి నుంచి టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనికితోడు కరోనాతో యునెస్కో గుర్తింపు వాయిదా పడింది. 2021 జులై 25న యునెస్కో గుర్తింపు రావడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొత్తగా టెండర్లు ఏర్పాటు చేసి పనులు సకాలంలో ఆయ్యేలా చర్యలు తీసుకున్నారు. త్వరలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక నేపథ్యంలో పనులు పూర్తి చేయడానికి గుత్తేదారు పనులు మొదలుపెట్టారు.

జిగేల్‌మని మెరిసిపోనున్న గోపురం..

పడమర ప్రధాన పాత్‌వే దారికి రెండు వైపులా మూడు అడుగుల ఎత్తులో ప్రత్యేక దీపాలు, అక్కడ నుంచి ఆలయం నలు దిక్కుల్లో నాలుగు స్తంభాలతో కూడిన హైమాస్ట్‌ దీపాలు, ఆలయ ప్రాంగణంలోనే ఆన్‌, ఆఫ్‌తో కూడిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ గోపురాన్ని ప్రత్యేక విద్యుత్తు దీపాలతో సుందరీకరించనున్నారు. కామేశ్వరాలయ పునర్నిర్మాణం కూడా పూర్తైతే మరింత ఆకర్షణీయంగా మారనుంది.

కేటాయించిన నిధులు: రూ. 26 లక్షలు

భూగర్భ విద్యుత్తు లైను పొడవు: 1500 మీటర్లు

కందకం లోతు: 2 అడుగులు

పెద్ద దీపాలు: 4

ఇదీ చూడండి: Ramappa temple : రామప్పకు వెళ్తే ఈ పర్యటక ప్రాంతాలూ చూసేయండి మరి!

ABOUT THE AUTHOR

...view details