వరంగల్ అర్బన్ జిల్లాలో నిత్యావసర వస్తువుల కొనుగోలుతోపాటు గృహసంబంధమైన వస్తువుల కొనుగోలుకు ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద ఎలాంటి రద్దీ లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల జనం బారులు తీరారు. మాస్కులు ధరించి కార్యాలయానికి వస్తున్నా భౌతిక దూరం మాత్రం సరిగ్గా పాటించట్లేదు.
వినయ్ భాస్కర్ సరకుల పంపిణీ..
అర్బన్ జిల్లాలో ఇప్పటివరకు 27 పాజిటివ్ కేసులకుగాను.. 26 మంది గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మాత్రమే చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 383 మంది రాగా.. అధికారులుల వారికి స్టాంపింగ్ వేసి హోం క్వారైంటైన్ చేశారు. ఇంకా ఎవరైనా వస్తే వారంతా స్వచ్ఛందంగా ముందుకువచ్చి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ 200 మంది నిరుపేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.
మంత్రి ఎర్రబెల్లి స్పందన:
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ దాదాపు 600 మంది ఆటో డ్రైవర్లు, వివిధ మత పెద్దలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఏపీ రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సిన వలసకార్మికులు గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చేరుకున్నారు. వారి అవస్థలను చూసిన ఈనాడు- ఈటీవీ బృందం మంత్రికి సమాచారం అందించారు. స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే వారికి వసతి, ఆహారం అందించాలని మైలారం గ్రామ సర్పంచ్‌ను ఆదేశించారు. అనంతరం వలసకూలీల వద్దకు మంత్రి చేరుకొని నగదు సహాయంతో పాటు మాస్కులను అందజేశారు.
మహబూబాబాద్‌లో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నెలలో వివాహ ముహుర్తాలు ఉండటం వల్ల బంగారు ఆభరణాలు, రెడీమెడ్ వస్త్రాల దుకాణాలు, ఫర్నీచర్ షాపుల్లో రద్దీ కనబడింది. భౌతిక దూరం పాటించకుండా దుకాణాల ముందు బారులు తీరారు. భౌతిక దూరం పాటించని వారిపై అధికారులు జరిమానాలు విధించిన ప్రయోజనం కనిపించలేదు.
ఇదీ చూడండి :ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!