Omicron case in Warangal: రాష్ట్ర వ్యాప్తంగా ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. ఇవాళ ఒక్కరోజే మూడు జిల్లాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేసులు నమోదు కాగా తాజాగా హనుమకొండ జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్.వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. స్విట్జర్లాండ్ నుంచి డిసెంబర్ 12న ఓ యువకుడు(24) ఇటీవల నగరానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అతనికి సాధారణంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఒమిక్రన్ పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని చెప్పారు. వెంటనే బాధితుడిని హైదరాబాద్‌లోని టిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
బాధితుడికి సంబంధించి 20 మంది అత్యంత సన్నిహిత బంధుమిత్రుల నమూనాలను సేకరించి వైరస్ నిర్ధరణ పరీక్షల కోసం పంపినట్లు వెంకటరమణ చెప్పారు. ఒమిక్రాన్ విస్తృతమవుతున్న నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో
Rajanna Sircilla district Omicron Cases: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణ కాగా.. ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 4 కు చేరింది. దుబాయి నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ గుర్తించగా... బాధితుడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్ వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో సోమవారం తేలింది. ముగ్గురు బాధితులను చికిత్స కోసం టిమ్స్‌కు తరలించారు.
ఖమ్మంలో తొలి కేసు
First Omicron Case in Khammam: ఖమ్మం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైరాలజీ ల్యాబ్ నుంచి ఆదివారం రాత్రి సమాచారం అందడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి ఈనెల 19న ఖమ్మంలోని ఓ బహుళ అంతస్తులో నివాసముంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. కరోనా అనుమానిత లక్షణాలతో ఈనెల 20న ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది. యువతి నుంచి సేకరించిన నమూనాను వైద్యసిబ్బంది ఒమిక్రాన్ అనుమానిత పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపించారు.
అక్కడ జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైద్య బృందాలు ఆమె కుటుంబీకులను కలిసి అప్రమత్తం చేశారు. యువతి కరోనా టీకా రెండు డోసులు తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి నమూనాలు సేకరించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:'రోడ్డుపై ఆ పని చేయడం బ్యాన్.. అవసరమైతే 144 సెక్షన్'