ఓరుగల్లు కేంద్రంగా పరిపాలించిన కాకతీయుల కళా వైభవం మాటల్లో వర్ణించలేనిది. అత్యద్భుత శిల్ప సంపదకు ఓరుగల్లును చిరునామాగా మార్చిన ఖ్యాతి కాకతీయులకే దక్కుతుంది. వెలకట్టలేని వారసత్వ సంపదను తరతరాలకు అందించిన ఘనతను వీరే సొంతం చేసుకున్నారు. గొలుసు కట్టు చెరువులు నిర్మించి... ఆంధ్రదేశాన్ని సస్యశ్యామలం చేసిన గొప్ప కీర్తి కూడా కాకతీయ సామ్రాజ్యాధినేతలు సొంతం చేసుకున్నారు. ఔరా.... అనిపించే రీతిలో ఆనాడే అద్భుత సాంకేతికతను ఉపయోగించి... నీటిలో తేలియాడే ఇటుకులతో రామప్పను ఆలయాన్ని నిర్మించారు. ఇటీవలే ఆ సాంకేతికతకు అచ్చెరువొందిన యునెస్కో... రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి..... ఆలయ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.
అలనాటి కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 7 నుంచి వారం రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బస్తర్‌లో ఉన్న 22వ కాకతీయ వారసులైన కమల్‌చంద్ర భంజ్ దేవ్‌ను.... ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలంటూ.... రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. వారం పాటు జరిగే వేడుకల్లో సాంసృతిక, సాహిత్య, కళ ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు. కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా జరిపేందుకు 50 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఇప్పటికే మంత్రులు తెలిపారు. చరిత్ర పరిశోధకులు, టార్చ్ స్వచ్ఛంద సంస్థ ఇందులో భాగమవుతున్నట్లు వెల్లడించారు.