తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి వరంగల్​, హన్మకొండ జిల్లాలు - తెలంగాణ తాజా వార్తలు

వరంగల్​ రూరల్​, అర్బన్​ జిల్లాల స్థానంలో వరంగల్​, హన్మకొండ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం తుది నోటిఫికేషన్​ ఇచ్చింది. ఇవాళ్టి తేదీతోనే గెజిట్​ నోటిఫికేషన్​ ప్రచురించనున్నారు.

warangal district names changed
warangal district names changed

By

Published : Aug 12, 2021, 4:35 PM IST

Updated : Aug 12, 2021, 7:47 PM IST

వరంగల్ అర్బన్​, రూరల్​ జిల్లాల పేర్లు.. హన్మకొండ, వరంగల్​గా మారాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ వెలువడ్డాయి. 14 మండలాలతో హన్మకొండ.. 13 మండలాలతో వరంగల్​ జిల్లాలు ఏర్పాటయ్యాయి. పేర్ల మార్పుతో ఆయా జిల్లాల్లో ప్రజలు సంబురాలు చేసుకున్నారు.

వరంగల్​ అర్బన్​, రూరల్​ జిల్లాల పేర్లు, మండలాల మార్పులు, చేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరుతూ 30 రోజుల సమయాన్ని ఇస్తూ... గత నెల 12న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్​ ఇచ్చింది. ఈనెల రోజుల్లో వరంగల్ రూరల్​ జిల్లా నుంచి 41, అర్బన్​ జిల్లా నుంచి 92 విజ్ఞప్తులు వచ్చాయి. వాటిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్​, ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​భాస్కర్, ఎమ్మెల్యేలు, అధికారులు కలెక్టరేట్​లో సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ మధ్యాహ్నం.. హన్మకొండ, వరంగల్​గా పేర్లుగా మారుస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.

హన్మకొండ జిల్లా స్వరూపం..

హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో హన్మకొండ జిల్లాగా మారింది. జిల్లా వైశాల్యం-1688.75 చదరపు కిలోమీటర్లు. జనాభా- 9,05,744 మంది. హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్ పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట.. మొత్తం 14 మండలాలు హన్మకొండ జిల్లాలో ఉన్నాయి.

వరంగల్​ జిల్లా స్వరూపం..

వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్​ జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగింది. వైశాల్యం- 1805.37 చదరపు కిలోమీటర్లు. జనాభా- 8, 93, 715 మంది. వరంగల్, ఖిలా వరంగల్, గీసుకొండ, వర్దన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ.. మొత్తం 13 మండలాలు వరంగల్ జిల్లాలో ఉన్నాయి.

ప్రజలు సంబురాలు..

పేర్ల మార్పుతో రెండు జిల్లాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కలెక్టరేట్​ వద్ద జరిగిన సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అందరూ మిఠాయిలు పంచుకున్నారు. ప్రజల విజ్ఞప్తులకు అనుగుణంగానే ముఖ్యమంత్రి.. నిర్ణయం తీసుకున్నారని, దీనిపై కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

ఇటు వరంగల్​లోనూ సంబురాలు చేసుకున్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

ఇవీచూడండి:Warangal Mayor: అరగంటసేపు లిఫ్ట్​లోనే మేయర్​.. చెమటలు కక్కుతూ బయటకు..

Last Updated : Aug 12, 2021, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details