వరంగల్‌లో ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటు దిశగా అడుగులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ప్రధానంగా వరంగల్ అర్బన్ జిల్లాలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గతం వారంలో 123, 102, 138, 152,111, 131 ఇలా ఏ రోజూ వందకు తగ్గని రీతిలో కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది. సామాన్యులతోపాటుగా... పోలీసులు, వైద్యులు, నర్సులు, జైలు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు వీరు వారన్న తేడా లేకుండా అందరూ కొవిడ్ బారిన పడుతున్నారు.
బాధితులను ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి
వరంగల్ గ్రామీణం, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోనూ కేసులు గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రి కొవిడ్ వార్జులో 250 పడకలున్నా.. కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండడం వల్ల అవి సరిపోవట్లేదు. వచ్చే రెండు నెలల్లోనూ కేసులు ఇదే స్థాయిలో పెరిగితే బాధితులను ఎక్కడ ఉంచాలో తెలియని స్ధితి నెలకొంది.
నిధులు విడుదల
ఈ నేపథ్యంలోనే కొవిడ్ చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రిపై ప్రభుత్వం దృష్టిసారించింది. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో దాదాపు నిర్మాణం పూర్తయిన ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్షయోజన ఆసుపత్రిని ఇందుకోసం వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ ఆసుపత్రి సామర్థ్యం 250 పడకలు కాగా... ఇటీవల జరిగిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్షలో మంత్రి.. త్వరలోనే ఈ ఆసుపత్రి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. సమీక్ష ముగిసిన రెండు రోజులకే...ఆసుపత్రి కోసం 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. పీఎంఎస్ఎస్వై ఆసుపత్రి కోసం 10 కోట్లు అడిగితే ప్రభుత్వం 12 కోట్లు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం విడుదలైన నిధులతో రోగులకు కావాల్సిన పరికరాలను సమకూర్చుకుని ఈ నెలలోనే ఆసుపత్రిలో కొవిడ్ సేవలు ప్రారంభమైయ్యే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల