సొంతగూడులేని వారి కష్టాలెన్నో..
విద్యా, వ్యాపార రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళుతున్న నర్సంపేటలో ఉపాధి కోసం ఎందరో పేద, మధ్య తరగతి ప్రజలు వస్తున్నారు. వీరంతా పట్టణంలో అద్దెకుంటున్నారు. నర్సంపేటలో గతేడాది జరిపిన సర్వేలో 1300 మంది సొంతిల్లు లేని వారున్నట్లు తేలింది. కనీస సౌకర్యాల్లేకున్నా ఇళ్ల యజమానులు అడిగినంత చెల్లించి కిరాయికి ఉండక తప్పని పరిస్థితి. ఈ కుటుంబాల్లో విధి వక్రీకరించి ఎవరైనా కాలం చేస్తే వారికి వారి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కార ప్రక్రియను సవ్యంగా జరుపుకోలేని పరిస్థితి. వీరి దుస్థితిని గుర్తించిన ఛైర్‌పర్సన్ రజని పురపాలక సంఘం నిధులతో ఆఖరి మజిలీ ఆవాస భవన నిర్మాణం చేసేందుకు శ్రీకారం చుట్టారు. మాదన్నపేట మార్గంలోని హిందూ శ్మశానవాటిక ప్రహరీని ఆనుకొని ఆ భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. భవన నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు నిధుల నుంచి రూ.16 లక్షలు మంజూరు చేశారు. అద్దెకు ఉంటున్న కుటుంబీకులు వారి బంధువుల మృతదేహాలను తీసుకొచ్చి ఉంచేందుకు, అక్కడే దశదిన కర్మ తంతును సంప్రదాయబద్ధంగా జరుపుకునేందు కు అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నారు.