వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నుంచి మడికొండ మీదుగా హైదరాబాద్ వెళ్లే వైపే కాకుండా, ములుగు వైపు వెళ్లే 163 జాతీయ రహదారితో పాటు వరంగల్, హన్మకొండ నుంచి కరీంనగర్, ఖమ్మం వెళ్లే 563 జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక నగరంలోని రహదారులు భవనాల శాఖ రోడ్లు కూడా అధ్వానంగా మారగా ఇటీవల కొన్నింటికి మరమ్మతు చేపట్టారు. వరంగల్ నగర మహానగర పాలక సంస్థ అధీనంలోని రహదారులు సగానికి సగం దెబ్బతిని వాహనదారులు నరకం చూస్తున్నారు.
వానలకు దెబ్బతిన్న రోడ్లు.. పట్టించుకోని అధికారులు - వరంగల్‌లో రహదారుల ప్రస్తుత పరిస్థితులు
అసలే గతుకుల రోడ్లు.. ఆపై కురిసిన జోరు వానలకు మరింత అధ్వానంగా మారాయి. పెద్దపెద్ద గుంతలు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరంగల్ మహా నగరం చుట్టూ ప్రధాన రహదారులన్నీ దారుణంగా మారాయి. వరంగల్ నగరంలో 45 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులున్నాయి. 120 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ దారులుండగా, సుమారు 450 కిలోమీటర్ల మేర కార్పొరేషన్ రహదారులున్నాయి. వీటిల్లో జాతీయ రహదారులకు మరమ్మతు పూర్తిగా కరవైంది.
వానలకు దెబ్బతిన్న రోడ్లు.. పట్టించుకోని అధికారులు
నగరం శివారుల్లోని జాతీయ రహదారులపై భారీ గుంతలు ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్రవాహనదారులు రాత్రివేళల్లో గుంతలను గమనించక పడిపోతున్నారు. వరంగల్ నుంచి ములుగు వైపునకు వెళ్లే జాతీయ రహదారి 163 ఇటీవల కురిసిన వానలకు బురదమయంగా మారింది. నెల కిందట ఇక్కడ ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులు కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి.
- వరంగల్ నగరంలో గతంలో వేసిన రహదారులు నాసిరకంగా ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో ధ్వంసమయ్యాయి. ఫలితంగా ఆయా డివిజన్ల కార్పొరేటర్లు నిధులు మంజూరు చేయాలని కోరడంతో కొన్ని డివిజన్లకు రహదారులు మంజూరయ్యాయి. చాలా చోట్ల పనులు ప్రారంభం కాలేదు. ఇక వరంగల్ బస్టాండు ప్రాంతంలో స్మార్ట్ రోడ్డు మంజూరైనా.. అది నిర్మాణం కాకపోవడంతో కంకర తేలి అధ్వానంగా మారింది. వరంగల్ ఎంజీఎం కూడలిలో నిత్యం పెద్ద సంఖ్యలో రోగులతో అంబులెన్సులు వెళుతుంటాయి. అక్కడా రహదారి గుంతలమయంగా, ప్రమాదకరంగా మారినా బాగు చేయడం లేదు. పోతన జంక్షన్‌లోనూ జాతీయ రహదారిపై భారీ గుంతల వల్ల తరచూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జాతీయ రహదారులపై భారీ గుంతలను అధికారులు పూడ్చకపోవడంతో స్థానికులే మొరం, కలప, రాళ్లతో తాత్కాలికంగా పూడ్చుకుంటున్నారు. ఈ రహదారులపై వివిధ శాఖల అధికారులను వివరణ కోరగా గుంతలను పూడ్చేందుకు పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు.
- హన్మకొండ నుంచి ఖమ్మం వెళ్లే వాహనదారులు హంటర్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తుంటారు. ఈ రహదారిపై అనేక చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. దీనికి తోడు రోడ్డుపై గుంతలు ఉండడంతో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి.