వరంగల్ నగరంలోని 58 డివిజన్ల అభివృద్ధికి నిధులు సాధించేందుకు కార్పొరేటర్లు మేయర్ చుట్టూ తిరుగుతున్నారు. మూడు, నాలుగు నెలలుగా మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశాల్లో డివిజన్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఈనెలలో వారం రోజుల వ్యవధిలోనే రెండు కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఈనెల 15న నిర్వహించిన సమావేశంలో రూ.83.56 కోట్లు, 23న నిర్వహించిన సమావేశంలో రూ.87.42 కోట్లు కేటాయిస్తూ తీర్మానాలు చేశారు.
అంతకుముందు రెండు, మూడు నెలలు జరిగిన సమావేశాల్లో చేసిన తీర్మానాల్లో ఆయా పనులకు రూ.250 కోట్ల నిధులు మంజూరు చేస్తూ తీర్మానాలు చేశారు. జనరల్ ఫండ్స్, పట్టణ ప్రగతిలో నిధుల్లేవని అధికారులంటున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన గ్రీన్ బడ్జెట్ కింద వచ్చే నిధులను, కొత్తగా ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చే నిధులు వినియోగించుకోవచ్చని భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆశతో ఉన్నారు.
నిధులు ఇలా..
- 2020-21 ఆర్థిక సంవత్సరం గ్రేటర్ బడ్జెట్‌లో జనరల్ ఫండ్స్‌కు అన్ని కలిపి సుమారు రూ.100- 120 కోట్లే ఉంటాయి.
- పట్టణ ప్రగతి ద్వారా ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు వరకు రూ.71 కోట్లు మాత్రమే వచ్చాయి.
- ఎస్సీ ఉప ప్రణాళికలో రూ.33 కోట్ల గ్రాంటు ఉంది.
- స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ.50 కోట్ల నిధులున్నాయి. వీటిపై కౌన్సిల్ పెత్తనం లేదు. రాష్ట్ర స్మార్ట్‌సిటీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది.
- సీఎం హామీల పథకం ద్వారా రూ.650 కోట్ల నిధులకు పరిపాలన అనుమతి ఉంది. రెండున్నరేళ్లుగా నిధులు రావడంలేదు. ప్రస్తుతం రూ.150కోట్లుతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
తీర్మానాల్లో కొన్ని..
- ఈ నెల 15న పట్టణ ప్రగతి ద్వారా వాహనాల కొనుగోలుకు 30.58 కోట్లు
- జనరల్ ఫండ్ కింద 34 డివిజన్లలో చేపట్టే పనులకు 38.83 కోట్లు
- ఈ నెల 23న పట్టణ ప్రగతి కింద పనులకు మరో రూ.91 కోట్లు
- ఎస్సీ సబ్ ప్లాన్ కింద 145 పనులకు రూ.33 కోట్లు
- జనరల్ ఫండ్ కింద 34 డివిజన్లకు 145 పనులకు రూ.37.29 కోట్లు