మిర్చి రైతులకు ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆవేదన వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి సీజన్ ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు వేకువజామునే మార్కెట్కు సరుకు తీసుకు వస్తున్నారు. ఈసారి ప్రారంభంలోనే మిర్చి రికార్డు స్థాయిలో ధర పలకడం విశేషం. తేజ రకం క్వింటాలుకు రూ.18,300 ధర రావడం రైతులకు ఆనందాన్నిస్తోంది. ప్రస్తుత ధర చూసి సంతోషపడుతున్నా.. ముందు ముందు ఇదే ధర ఉంటుందా అన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.
మిర్చి దిగుబడి తగ్గింది..
ఈసారి భారీ వర్షాల కారణంగా తెగుళ్లు వ్యాపించి దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరానికి పది నుంచి 13 క్వింటాళ్లు కూడా రావడం గగనమైంది. ఇక పురుగు మందులు, కూలీల ధరలు కలుపుకుని పెట్టుబడి ఖర్చులు సైతం రెండింతలైయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులకు మంచి ధర రావడం ఆనందాన్నే ఇచ్చింది. కానీ ఇదే ధరలు ఇకపైన కూడా ఇలాగే ఉండాలని వారంతా కోరుకుంటున్నారు. అప్పుడే పెట్టిన పెట్టుబడుల ఖర్చులు తిరిగి వస్తాయని చెపుతున్నారు. ఏమాత్రం తగ్గినా నష్టాలపాలౌతామని అంటున్నారు.
నాణ్యత లేదని సాకు చూపి..
నాణ్యతను సాకుగా చూపి ధర మరీ తగ్గించేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా మిర్చి పది నుంచి పన్నెండు వేలకు కొంటుంటే.. తాలు రకం మిర్చి మూడు వేలు మాత్రమే పలుకుతోందని రైతులు చెపుతున్నారు.
వేర్వేరుగా తీసుకురావాలని అధికారులు
నాణ్యమైన మిర్చిని, నాణ్యత లేని మిర్చిని కలిపి తీసుకురాకుండా.. వేర్వేరుగా తీసుకురావాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలిపారు. ఒకేసారి మిర్చిని అందరూ మార్కెట్కు తీసుకువస్తే ధరలు తక్కువుగా వచ్చే అవకాశముందని.. అందుకే శీతలగిడ్డంగిల్లో భద్రపరుచుకోవాలని సూచించారు.
మరో పదినుంచి పదిహేను రోజులు దాటితే.... మార్కెట్కు మరింత మిర్చి పోటెత్తనుంది. భారీగా సరుకు మార్కెట్కు తీసుకొచ్చి విక్రయించేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇదే అదునుగా... వ్యాపారులు ధరలు తగ్గిస్తే రైతులు భారీగా నష్టపోయే అవకాశాలు లేకపోలేదు.
ఇదీ చూడండి : 'హైకోర్టు చెప్పినట్లుగానే రీపోస్టుమార్టమ్ జరుగుతోంది'