కంటికి కనిపించని కరోనా వైరస్ ఎంతటి కల్లోలం సృష్టిస్తుందో... అందరికీ తెలిసిందే. మొదటి దశతో పోలిస్తే... రెండో దశ కంటిమీద కునుకు లేకుండా చేసింది. ప్రాణవాయువు దొరక్క, ఆసుపత్రుల్లో పడకలు లభించక.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారి కుటుంబసభ్యులూ.... నరకం అనుభవించారు. ఇదే సమయంలో మానవత్వంతో మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. అలాంటివారిలో వరంగల్‌కు చెందిన శాంత తౌటం(Shanta Thoutam) ఒకరు.
ట్విట్టర్‌లో తెలియజేస్తే..
అవసరం ఉన్నవారు ఆక్సిజన్ కావాలని ట్విట్టర్‌లో తెలియజేస్తే... కాన్సంట్రేటర్లను శాంత తౌటం అందించారు. ఎంతో మందికి ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టారు. ఉపాధి కోల్పోయి పస్తులుంటున్న కుటుంబాలకు నిత్యావసరాలు అందించి వారి ఆకలి తీర్చారు. గతేడాది లాక్‌డౌన్‌లో వలసకార్మికులకు సహాయం చేశారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆసుపత్రుల బిల్లులు కట్టలేనివారిని ఆదుకుని శాంత మానవత్వాన్ని చాటారు.