Emotional harassment of female sarpanch in Janakipuram: మహిళా దినోత్సవం మరుసటి రోజునే లైంగిక వేధింపులకు గురైనట్లు.. అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై ఓ మహిళా సర్పంచ్ ఆరోపణలు చేసింది. ఆ నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. దీంతో తాను మానసిక క్షోభకు గురవుతున్నట్లు సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచి కురసపల్లి నవ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్‌కు చెందిన ప్రముఖ నేతల్లో.. ఓ ఎమ్మెల్యే తన కోరిక తీర్చమంటూ రోజూ మానసికంగా వేధించేవాడని నవ్య ఆరోపించారు. ఆ నాయకుడు చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతో గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధుల్లో వివక్ష చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు గ్రామంలో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించట్లేదని చెప్పారు.
నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని నవ్య చెప్పారు. వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే అధికారం అని ఆరోపించారు. నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలు ఉండటం వలన అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గత నెలలో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడు ఓ మహిళా ప్రజా ప్రతినిధి తనను తీవ్రంగా అవమానించారన్నారు. ఇప్పటికైనా వేధిస్తున్న నేత మహిళలతో మంచిగా వ్యవహరించాలని హితవు పలికారు.